‘సంప్రదాయ కుటుంబ నేపథ్యంతో కూడిన పాత్రల్లో నటించడమంటే ఇష్టం’ అని చెప్పారు చిన్నితెర నటి ప్రిన్సీ. ‘కుంకుమ పువ్వు’ సీరియల్‌లో ‘అమృత’ పాత్రధారిగా టీవీ ప్రేక్షకులకు చిరపరిచితమైన ప్రిన్సీ గత కొంత కాలంగా తెలుగు సీరియళ్లలో రాణిస్తున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఫిక్షన్ సీరియల్ ‘ప్రేమ’లోని పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రిన్సీ ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవీ..
అమ్మ దిద్దించిన అభినయం
మేం జన్మతః మలయాళీలం అయినా కర్ణాటకలో సెటిలయ్యాం. మా అమ్మకు నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో రకరకాల కేరక్టర్లను అనుకరిస్తూ అభినయిస్తుంటే చూస్తూ, రకరకాల డ్రెస్సులవీ వేసి ర్యాంప్‌వాక్ చేయిస్తూ మురిసిపోయేది. అలా అలా నేనూ యాక్టింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఓ రకంగా మా అమ్మగారు నటన వైపు నన్ను ఫోర్స్ చేశారనే చెప్పాలి.
సరదాగా ఓకే చెప్పా!
యాక్టింగ్ అభిరుచిగా ఉన్నా... చదువులో కూడా మంచి మార్కులే తెచ్చుకునేదాన్ని. నిజానికి ఐఎఎస్ ఆఫీసర్ కావాలనేది నా లక్ష్యం. అయితే టీనేజ్‌లోనే ఓ సీరియల్ నిర్మాతలు సంప్రదించడంతో చిన్నప్పటి అభిరుచి తీర్చుకుందామని సరదాగా ఓకే చెప్పాను. అనుకోకుండా ఆ సీరియల్ ద్వారా నాకు మంచి పేరు రావడం, తర్వాత తర్వాత సీరియల్స్‌లో బిజీ కావడంతో చదువుకు స్వస్తి చెప్పక తçప్పలేదు. అలాగే తెలుగు టీవీకి కూడా పరిచయం అయ్యాను. ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తుండడంతో ప్రస్తుతం కర్ణాటకలోని షిమోగ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాను. షూట్స్ ఉన్న సమయంలో వచ్చి వెళ్తుంటాను.
చిన్నితెరే సురక్షితం
అమ్మాయిలకు వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. అయితే సినీ నటీ నటులకు ఆదరణ ఎక్కువ కావడంతో సహజంగానే వారిపై కాన్సన్‌ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దీంతో వారికి సంబంధించిన విషయాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తుంటాయి. మిగతా వాటితో పోల్చితే చిన్నితెర అమ్మాయిలకు మరింత సురక్షితమైనదని నా అభిప్రాయం. చాలావరకూ అవుట్ డోర్ షూటింగ్స్ ఉండవు. సినిమాల్లో నటించకూడదని ఏమీ అనుకోవడం లేదు, అలాగే చేసి తీరాలనే లక్ష్యాలు కూడా ఏమీ లేవు. ఒకవేళ మంచి అవకాశాలు వచ్చి అవీ ట్రెడిషనల్ పాత్రలైతే తప్పక చేస్తాను. అలాగే అవుదామనుకుని కాలేకపోయిన ఐఎఎస్ ఆఫీసర్ పాత్ర వస్తే మాత్రం వదులుకోను.
తెలుగొచ్చేసింది
సీరియల్స్‌లో మాటలు దానికి తగ్గ హావభావాలు, బరువైన సన్నివేశాలు సహజం. దీంతో భాష రాకపోవడం వల్ల మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాకు తమిళ్ బాగా వచ్చు. దీనివల్ల తమిళం వచ్చినవారు నాకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేవారు. అలా అలా ఇప్పుడు తెలుగు కూడా బాగానే వచ్చేసింది. కన్నడ, మలయాళం, తమిల్, ఇంగ్లిష్, తెలుగు భాషలు వచ్చు. రెండు అవార్డులు తెలుగులోనే వచ్చాయి. దాంతో అక్కడ సాధించలేనిది ఇక్కడ సాధించానని హ్యాపీగా ఉంది.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment