ఆ పాట చూసే పోటుగాడు చేయాలనుకున్నాం: లగడపాటి శిరీష, శ్రీధర్
ఆ పాట చూసే పోటుగాడు చేయాలనుకున్నాం: లగడపాటి శిరీష, శ్రీధర్
Published Thu, Sep 12 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
‘‘ఈ చిత్ర విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే విజయవంతమైన సినిమాకి కావల్సిన అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం. ఆల్రెడీ కన్నడంలో ఘనవిజయం సాధించింది కాబట్టి తెలుగులో కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అంటున్నారు లగడపాటి శ్రీధర్, శిరీషా. మనోజ్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో వీళ్లు నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. కన్నడంలో ఘనవిజయం సాధించిన ‘గోవిందాయ నమః’ చిత్రానికి ఇది రీమేక్. శనివారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘పోటుగాడు’ గురించి శిరీషాశ్రీధర్ ఈ విధంగా మాట్లాడారు.
రెండేళ్ల విరామం తర్వాత మేం నిర్మించిన చిత్రం ఇది. ఈ గ్యాప్‌కి కారణం ఉంది. మేం నిర్మించిన ‘ఎవడి గోల వాడిదే’ చిత్రాన్ని ప్రేక్షకులు మినిమమ్ నాలుగు సార్లు చూశారు. ఆ తర్వాత నిర్మించిన ‘స్టయిల్’కి కూడా మంచి ఆదరణ లభించింది. ఈసారి కూడా ప్రేక్షకులు రెండు, మూడుసార్లు చూసే సినిమాని ఇవ్వాలనుకున్నాం. అలాంటి సమయంలోనే కన్నడంలో రూపొందుతున్న ‘గోవిందాయ నమ’ చిత్రానికి సంబంధించిన పాట చూడటం జరిగింది.
పాటలే ఇంత అద్భుతంగా తీస్తే.. ఇక ఆ దర్శకుడికి ఎంత ప్రతిభ ఉంటుంది? అనుకున్నాను. ఆ పాట చూసి, ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ వడియార్ దర్శకత్వంలోనే తెలుగు సినిమా కూడా చేయాలనుకుని, ఆయన్ను ఎంపిక చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథను మార్చాం. క్లయిమాక్స్‌ని పూర్తిగా మార్చేశాం.
**** అందుకే మనోజ్‌ని ఎన్నుకున్నాం: ఈ చిత్రంలో మనోజ్ పాత్ర నవరసాలు పండించాల్సి ఉంటుంది. తన పాత్రలో నాలుగు కోణాలుంటాయి. ఇన్ని కోణాలను పండించగల సత్తా కలక్షన్ కింగ్ మోహన్‌బాబుగారి కుమారుడు మనోజ్‌కి ఉంటుందనిపించింది. అందుకే తనను హీరోగా ఎంపిక చేశాం. ఈ సినిమాతో మనోజ్ ‘కలక్షన్ కింగ్’ అని కూడా అనిపించుకుంటాడు. తన ఎనర్జీ సూపర్బ్. డాన్స్ అద్భుతంగా చేశాడు. ఎప్పటిలానే రిస్కీ ఫైట్స్‌ని సునాసయంగా చేశాడు. కాలు, చెయ్యి బెణికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా విజయం మీద ఉన్న నమ్మకంతో దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మనోజ్ కెరీర్‌లో భారీ విడుదల ఇదే.
**** మోహన్‌బాబుగారు సినిమా బాగుందన్నారు: ఈ చిత్రాన్ని మోహన్‌బాబుగారు చూశారు. మా అబ్బాయితో మంచి సినిమా తీశావని అభినందించారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. అలాగే అక్కడక్కడా లాగ్ ఉందని చెప్పారు. ఆయన చెప్పిన చోట్ల ట్రిమ్ చేసిన తర్వాత, సినిమా ఇంకా బాగుందనిపించింది.
Advertisement
Advertisement