
చక్కని కథ... చిక్కని కథనం
‘‘ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాపై అంచనాలు పెరగడానికి పాటల విజయం ఓ కారణమైంది. చక్కని కథ, చిక్కని కథనం, మంచి పాటల సమాహారంతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత గిరిధర్ మామిడిపల్లి చెప్పారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై నంద్యాల రవి దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ రావె మా ఇంటికి’ వచ్చే నెల 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ -‘‘ఇందులో నాలుగు పాటలు రాశాను. అన్నీ సందర్భోచితంగా సాగే పాటలే. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ తర్వాత సంగీత దర్శకుడు కేయం. రాధాకృష్ణన్ నుంచి వచ్చిన మరో మంచి ఆల్బమ్ ఇది’’ అని చెప్పారు. ఇందులో మంచి పాత్ర చేశానని నాగశౌర్య, ఈ చిత్రం పాటలను బాలీవుడ్ మ్యూజిక్ డెరైక్టర్స్‌కి వినిపిస్తే, బాగున్నాయన్నారని అవికా గోర్ చెప్పారు. మంచి పాటలకు అవకాశం ఉన్న ఈ కథకు చక్కని స్వరాలు సమకూర్చడం ఆనందంగా ఉందని నంద్యాల రవి అన్నారు.