దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...
పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలో నూతన్‌ప్రసాద్ చీటికీ మాటికీ ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని చెబుతూంటే ఫక్కున నవ్వని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ డైలాగ్ సృష్టికర్త కాశీవిశ్వనాథ్. ఇలాంటి ఫన్‌టాస్టిక్ డైలాగ్స్‌ని ఆయన కోకొల్లలు సృష్టించారు. 1968 నుంచి ఆయన పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, కథలు, నాటికలు, రేడియో నాటకాలు రాసి బాగా పేరు తెచ్చుకున్నారు.
ఆయన ప్రతిభను గుర్తించిన నిర్మాత ఛటర్జీ ‘రామాయణంలో పిడకల వేట’ చిత్రానికి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. తొలి సినిమా తీసుకొచ్చిన ఖ్యాతితో ఆయన సినీ రచయితగా స్థిరపడిపోయారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ ’ ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం’, ‘దొంగ కోళు’్ల, ‘ఖైదీ నం 786’ తదితర చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 124 చిత్రాలకు కథ, మాటలు అందించిన కాశీవిశ్వనాథ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడు.
‘ఎదురింటి మొగుడు- పక్కింటి పెళ్లాం’, ‘శ్రీవారి చిందులు’ , ‘420’, ‘నాన్నగారు’... ఇలా మొత్తం 37 చిత్రాల్లో నటించారు. కాశీవిశ్వనాథ్‌లో చాలా మందికి తెలియని కోణం ఏమిటంటే- ఆయన మంచి వెయిట్ లిఫ్టర్. కోచ్‌గా అనేక మందికి వెయిట్ లిఫ్టింగ్ నేర్పించారు. సుమారు 50 ఏళ్ల నిర్విరామ సాిహ తీ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే కాశీ విశ్వనాథ్ మరణం-కళారంగానికి తీరని లోటు.