టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ!
లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాననేది సూపర్‌స్టార్ రజనీకాంత్ పాపులర్ డైలాగ్. ‘లింగా’ చిత్రం వైఫల్యం తర్వాత ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే లక్ష్యంతో కొంత విరామం తీసుకున్నారు రజనీ. ఎన్నో కథలు విని, ఫైనల్‌గా యువ దర్శకుడు రంజిత్ సిద్ధం చేసిన కథను ఓకే చేశారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ చడీచప్పుడు లేకుండా చెన్నైలో ప్రారంభమైపోయింది. ‘కపాలి’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రజనీ మాఫియా డాన్‌గా కనిపించనున్నారు. ఓల్డ్ మాఫియా డాన్ గెటప్‌లో రజనీ పోస్టర్స్ తమిళనాడు అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. రేపు ఈ సినిమా ఫలితం కూడా అంత సంచలనం సృష్టిస్తుందని థాను చాలా నమ్మకం కనబరుస్తున్నారు.
ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడ కుండా థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెన్నైలో ఓ స్టూడియోలో వేసిన థాయిలాండ్ తరహా సెట్ ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. ఈ సెట్‌లోనే అక్టోబర్ 7 వరకూ చిత్రీకరణ జరుపు తారు. అక్టోబరు 15 నుంచి మలేసియాలో 40 రోజుల భారీ షెడ్యూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, గోవాల్లో షెడ్యూల్స్ చేయనున్నారు. ‘ఘర్షణ’, ‘మల్లన్న’ తర్వాత ‘వి’ క్రియేషన్స్ పతాకంపై తెలుగులో థానుకిది మూడో సినిమా. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నాయిక. తెలుగు వెర్షన్ కోసం శక్తిమంతమైన టైటిల్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు. రజనీకాంత్ కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. ఇక ఆయన అభిమానులైతే రజనీని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామని ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.