కపాలితో గేమ్స్ వద్దు! | Rajinikanth receives rousing welcome in Malaysia as he arrives for 'Kabali' shoot | Sakshi
Sakshi News home page

కపాలితో గేమ్స్ వద్దు!

Published Thu, Oct 29 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

కపాలితో గేమ్స్ వద్దు!

కపాలితో గేమ్స్ వద్దు!

స్టయిల్ అంటే... రజనీ. సూపర్‌స్టార్ అంటే... రజనీ. సక్సెస్‌ఫుల్ ఫార్ములా అంటే... ‘బాషా’... ఆఫ్ ర్...ర్..ర..జనీ. అవును... సింహం సింగిల్‌గా వస్తోంది. ‘కపాలి’తో రజనీ సెట్స్‌పైకొచ్చాడు. బి... రెడీ ఫర్ ఎ బ్లాస్ట్.
 
రజనీకాంత్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ వాటిలో ‘బాషా’ కచ్చితంగా ఉంటుంది. ఆ చిత్రంలో మాణిక్‌బాషాగా రజనీ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఒక క్రేజ్. ఆ తరువాత తెలుగుతో సహా అనేక భాషల్లో సినిమాలకు ‘బాషా’ ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా అయింది. ‘బాషా’ తర్వాత రజనీ చాలా మాస్ క్యారెక్టర్స్ చేశారు. కానీ, గెటప్ పరంగా ‘బాషా’ అంత రఫ్‌గా, స్టయిలిష్‌గా కనిపించనేలేదు. మళ్లీ రజనీని అలా చూడాలనుకున్న ఆయన అభిమానులు తాజాగా ‘కపాలి’ సినిమా లుక్ చూసి పరమానందపడిపోయారు.

ఈ 159వ సినిమాలో... చలవ కళ్లద్దాలతో, నెరిసిన గడ్డంతో, సూట్‌లో రజనీ లుక్ అదిరిపోయిందని ఆయన వీరాభిమానులే కాదు... మామూలు ప్రేక్షకులు కూడా అంటున్నారు. రజనీని మళ్ళీ ఒక మాఫియా డాన్‌గా సరికొత్తగా చూపుతుందీ ‘కపాలి’. రజనీకాంత్ టైటిల్‌రోల్ చేస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు రంజిత్ నిర్దేశకత్వం వహిస్తున్నారు. ఓ డాన్ జీవితం ఆధారంగా ఈ కథ రూపొందిస్తున్నారట. ‘కపాలితో గేమ్స్ వద్దు... నాతో పెట్టుకుంటే అంతే’ అనే రేంజ్‌లో రజనీ ఈ చిత్రంలో రెచ్చిపోతారని సినీవర్గాల టాక్.
 
మలేసియా డాన్ గెటప్
ఇందులో మలేసియా అండర్‌వరల్డ్‌ను కంట్రోల్ చేసే డాన్ పాత్రలో రజనీ కనిపిస్తారట. అందుకే కీలక సన్నివేశాలను మలేసియాలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నయ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నవారిని రజనీ కాపాడే ఈ భారీ సీన్‌లో రజనీతో పాటు కీలక పాత్రధారులు రమేశ్, జాన్ విజయ్, మరో 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఈ సీన్ వస్తుందట. చెన్నైలోని పారామౌంట్ స్టూడియోలో తీసిన ఈ సీన్‌ను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయట. వినాయక చవితి నాడు షూటింగ్ ప్రారంభించి, ఇప్పటి దాకా చెన్నై చుట్టుపక్కలే చిత్రీకరణ చేసిన ‘కపాలి’ యూనిట్ తాజాగా మలేసియాకు మార్చింది. మరో రెండు వారాల పాటు అక్కడే షూటింగ్.
 
సెల్ఫీల సందడి
రెండు రోజుల క్రితం ‘కపాలి’ బృందం మలేసియా చేరుకుంది. కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి, బయటకు వస్తున్న సమయంలోనే రజనీ అభిమానులు భారీ ఎత్తున గుమిగూడిపోయారు. సూపర్ స్టార్ కోసం ఏర్పాటు చేసిన ‘టీమ్ గార్డ్ సెక్యూర్టీ’ బృందం రజనీని భద్రంగా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి తీసుకువచ్చింది. రజనీ తన అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక వాళ్లతో ఫొటోలు దిగారు. కొంతమంది అమ్మాయిలు ఆయనతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.
 
మలాకా గవర్నర్ మురిసిన వేళ
రజనీ మలేసియా వచ్చిన విషయం తెలుసుకున్న మలాకా (మలేసియాలో ఓ రాష్ట్రం) గవర్నర్ హడావిడి చేశారు. ఆయన రజనీకి వీరాభిమాని. అందుకే రజనీని కలవాలనుకున్నారు. ఈ సూపర్ స్టార్‌ను గవర్నర్ లంచ్‌కు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి రజనీకాంత్, చిత్రనిర్మాత కలైపులి థాను విందుకు హాజరయ్యారు. రజనీతో కలిసి విందు ఆరగించడం ఓ మర్చిపోలేని విషయం అని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. ఒకసారి ఫ్లయిట్‌లో రజనీని చూశాననీ, ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి అనీ ఆయన అన్నారు. ‘ముత్తు’ సినిమా చూసి రజనీకి అభిమాని అయ్యానని ఆయన వివరించారు. గవర్నర్ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ విందు కార్యక్రమం జరిగింది.
 
మలేసియా షెడ్యూల్ తరువాత మళ్ళీ చెన్నై, హైదరాబాద్‌లలో కూడా ‘కపాలి’ షూటింగ్ సందడి నెలకొంటుంది. రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుండగా, హీరో కుటుంబ సభ్యురాలిగా ధన్సిక పాత్రపోషణ చేస్తున్నారు. ఇప్పుడు తమిళ సినీరంగం అంతా రజనీ ‘కపాలి’ గురించే చర్చ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement