Successful formula
-
21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!
మనం ఇప్పటి వరకు ఎంతో మంది విజయ గాథలను (సక్సెస్ స్టోరీస్) గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 'నిర్మిత్ పారిఖ్' గురించి తెలుసుకుందాం. నిర్మిత్ పారిఖ్ ఎవరు? అయన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఆపిల్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదులుకుని భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే కుబేరుడయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తికంటే ముందు స్వదేశానికి వచ్చి ఏదైనా సొంతంగా చేయాలనే పట్టుదలతో జాబ్స్ ప్లాట్‌ఫామ్ 'అప్నా' (Apna) ప్రారంభించి ఎన్నో కంపెనీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ యాప్ ప్రారభించిన కేవలం 21 నెలల్లో ధనవంతుల జాబితాలో ఒకడయ్యాడు. నిర్మిత్ పారిఖ్ మొదలు పెట్టిన ఈ జాబ్ ప్లాట్‌ఫామ్ షాడోఫాక్స్, జొమాటో, ఢిల్లీవేరీ, G4S గ్లోబల్, బర్గర్ కింగ్ వంటి ఎన్నో కంపెనీలు ఉపయోగించుకున్నాయి. టెక్నాలజీలో మార్పు తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ యాప్ అతన్ని కోట్లకు అధిపతిని చేసింది. (ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) నిర్మిత్ పారిఖ్ 2023 మే నాటికి 1.1 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడయ్యాడు. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ. ఒక్క ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది, అతి తక్కువ కాలంలోనే అతని ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అప్నా యాప్ 10 కోట్లకు పైగా ఇంటర్వ్యూలను, ఒక కోటికి పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది. నిర్మిత్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అండ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బిజినెస్ నుంచి MBA చదివారు. ఈయన కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఇన్కోన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత అనేక సంస్థలలో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి తరువాత ఒక యాప్ ద్వారా గొప్ప సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికిఇ సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ
ఎంతోమంది చదువులో ముందుకు సాగలేకపోయినా జీవితంలో అనుకున్నది సాధించి సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో ఒకరు 'ప్రియాంక్ సుఖిజా' (Priyank Sukhija). ఇంతకీ ఈయన సాధించిన సక్సెస్ ఏమిటి? ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నాడనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. కేవలం 19 సంవత్సరాల వయసులోనే చదువుకి స్వస్తి చెప్పి ఏదైనా సొంతంగా చేయాలని నిర్ణయించుకుని, తన తండ్రి నుంచి కొంత డబ్బుని తీసుకుని మొదట్లో రెస్టారెంట్ లాజీజ్ ఎఫైర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నమైన, విజయవంతమైన రెస్టారెంట్ యజమానిగా నిలదొక్కుకోగలిగాడు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 30 కంటే ఎక్కువ హై-ఎండ్ రెస్టారెంట్లు, కేఫ్‌లను కలిగి ఉన్నారు. డయాబ్లో, లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్, వేర్‌హౌస్ కేఫ్, ఫ్లయింగ్ సాసర్, డ్రాగన్‌ఫ్లై ఎక్స్పీరియన్స్ వంటి పేర్లతో ఢిల్లీలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈయనకు బ్రాంచెస్ ఉన్నాయి. ప్రియాంక్ సుఖిజా రెస్టారెంట్లు అనేక రకాల వంటకాలకు ప్రసిద్ధి చెంది ఢిల్లీలోని ఇతర రెస్టారెంట్లకు పోటీగా నిలుస్తోంది. F&B Pvt Ltd పేరుతో ప్రియాంక్ సుఖిజా కంపెనీ 2022లో ఏకంగా రూ. 275 కోట్లను ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అతన్ని దేశంలోని అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని నికర ఆస్తుల విలువ అందుబాటులో లేదు. కానీ చిన్న మొత్తంతో బిజినెస్ ప్రారభించి ఈ రోజు భారదేశంలో లెక్కకు మించిన బ్రాంచెస్ ప్రారభించి విజయానికి చిరునామాగా నిలిచాడు. -
కపాలితో గేమ్స్ వద్దు!
స్టయిల్ అంటే... రజనీ. సూపర్‌స్టార్ అంటే... రజనీ. సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే... ‘బాషా’... ఆఫ్ ర్...ర్..ర..జనీ. అవును... సింహం సింగిల్‌గా వస్తోంది. ‘కపాలి’తో రజనీ సెట్స్పైకొచ్చాడు. బి... రెడీ ఫర్ ఎ బ్లాస్ట్. రజనీకాంత్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ వాటిలో ‘బాషా’ కచ్చితంగా ఉంటుంది. ఆ చిత్రంలో మాణిక్బాషాగా రజనీ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఒక క్రేజ్. ఆ తరువాత తెలుగుతో సహా అనేక భాషల్లో సినిమాలకు ‘బాషా’ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అయింది. ‘బాషా’ తర్వాత రజనీ చాలా మాస్ క్యారెక్టర్స్ చేశారు. కానీ, గెటప్ పరంగా ‘బాషా’ అంత రఫ్‌గా, స్టయిలిష్‌గా కనిపించనేలేదు. మళ్లీ రజనీని అలా చూడాలనుకున్న ఆయన అభిమానులు తాజాగా ‘కపాలి’ సినిమా లుక్ చూసి పరమానందపడిపోయారు. ఈ 159వ సినిమాలో... చలవ కళ్లద్దాలతో, నెరిసిన గడ్డంతో, సూట్లో రజనీ లుక్ అదిరిపోయిందని ఆయన వీరాభిమానులే కాదు... మామూలు ప్రేక్షకులు కూడా అంటున్నారు. రజనీని మళ్ళీ ఒక మాఫియా డాన్‌గా సరికొత్తగా చూపుతుందీ ‘కపాలి’. రజనీకాంత్ టైటిల్‌రోల్ చేస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు రంజిత్ నిర్దేశకత్వం వహిస్తున్నారు. ఓ డాన్ జీవితం ఆధారంగా ఈ కథ రూపొందిస్తున్నారట. ‘కపాలితో గేమ్స్ వద్దు... నాతో పెట్టుకుంటే అంతే’ అనే రేంజ్లో రజనీ ఈ చిత్రంలో రెచ్చిపోతారని సినీవర్గాల టాక్. మలేసియా డాన్ గెటప్ ఇందులో మలేసియా అండర్‌వరల్డ్‌ను కంట్రోల్ చేసే డాన్ పాత్రలో రజనీ కనిపిస్తారట. అందుకే కీలక సన్నివేశాలను మలేసియాలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నయ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నవారిని రజనీ కాపాడే ఈ భారీ సీన్లో రజనీతో పాటు కీలక పాత్రధారులు రమేశ్, జాన్ విజయ్, మరో 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఈ సీన్ వస్తుందట. చెన్నైలోని పారామౌంట్ స్టూడియోలో తీసిన ఈ సీన్‌ను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయట. వినాయక చవితి నాడు షూటింగ్ ప్రారంభించి, ఇప్పటి దాకా చెన్నై చుట్టుపక్కలే చిత్రీకరణ చేసిన ‘కపాలి’ యూనిట్ తాజాగా మలేసియాకు మార్చింది. మరో రెండు వారాల పాటు అక్కడే షూటింగ్. సెల్ఫీల సందడి రెండు రోజుల క్రితం ‘కపాలి’ బృందం మలేసియా చేరుకుంది. కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి, బయటకు వస్తున్న సమయంలోనే రజనీ అభిమానులు భారీ ఎత్తున గుమిగూడిపోయారు. సూపర్ స్టార్ కోసం ఏర్పాటు చేసిన ‘టీమ్ గార్డ్ సెక్యూర్టీ’ బృందం రజనీని భద్రంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి తీసుకువచ్చింది. రజనీ తన అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక వాళ్లతో ఫొటోలు దిగారు. కొంతమంది అమ్మాయిలు ఆయనతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. మలాకా గవర్నర్ మురిసిన వేళ రజనీ మలేసియా వచ్చిన విషయం తెలుసుకున్న మలాకా (మలేసియాలో ఓ రాష్ట్రం) గవర్నర్ హడావిడి చేశారు. ఆయన రజనీకి వీరాభిమాని. అందుకే రజనీని కలవాలనుకున్నారు. ఈ సూపర్ స్టార్‌ను గవర్నర్ లంచ్‌కు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి రజనీకాంత్, చిత్రనిర్మాత కలైపులి థాను విందుకు హాజరయ్యారు. రజనీతో కలిసి విందు ఆరగించడం ఓ మర్చిపోలేని విషయం అని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. ఒకసారి ఫ్లయిట్లో రజనీని చూశాననీ, ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి అనీ ఆయన అన్నారు. ‘ముత్తు’ సినిమా చూసి రజనీకి అభిమాని అయ్యానని ఆయన వివరించారు. గవర్నర్ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ విందు కార్యక్రమం జరిగింది. మలేసియా షెడ్యూల్ తరువాత మళ్ళీ చెన్నై, హైదరాబాద్‌లలో కూడా ‘కపాలి’ షూటింగ్ సందడి నెలకొంటుంది. రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుండగా, హీరో కుటుంబ సభ్యురాలిగా ధన్సిక పాత్రపోషణ చేస్తున్నారు. ఇప్పుడు తమిళ సినీరంగం అంతా రజనీ ‘కపాలి’ గురించే చర్చ.