హాలీవుడ్ సూపర్ స్టార్‌పై నిషేధం!
లాస్ ఏంజిల్స్: 'రెవనెంట్' సినిమాతో ఈ ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో ఇండోనేషియాలో చిక్కులు ఎదుర్కొంటున్నాడు. ఆయన తమ దేశానికి రాకుండా నిషేధం విధించాలని ఇండోనేషియా భావిస్తోంది. పర్యావరణ కార్యకర్త అయిన 41 ఏళ్ల లియో గత నెల ఇండోనేషియాలోని సమత్రా దీవులను సందర్శించాడు. ఆ తర్వాత అమెరికా తిరిగి వచ్చిన ఆయన ఇండోనేషియాలోని పామాయిల్ తోటలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయని, ముఖ్యంగా అటవీ వర్షపాతం తగ్గిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశాడు.
పామాయిల్ తోటల కారణంగా సమత్ర దీవుల్లోని లెవుసర్ పర్యావరణ ప్రాంతంలోని జంతువుల మనుగడ ప్రమాదంలో పడిందని, అక్కడి పులులు, ఏనుగులు ఆవాస స్థలాలను కోల్పోతున్నాయని చెప్పాడు. పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ తోటల కోసం అడవులను కాల్చివేసి.. నరికివేసే పద్ధతిని అక్కడి రైతులు వాడుతున్నట్టు యూఎస్ మ్యాగజీన్ తన కథనంలో తెలిపింది. ఈ తోటల విస్తరణ ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో ఏనుగులు, ఇతర అటవీ జంతువులకు ఆహారం, నీరు లభించడం లేదని, దీంతో ఈ జీవులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
డియోకాప్రియో చేసిన వ్యాఖ్యలు, ఈ విషయంలో అతడు రాసిన వ్యాసంపై ఇండోనేషియా కన్నెర్ర జేసింది. అతడు మరోసారి ఇండోనేషియా రాకుండా నిషేధం విధిస్తామని ఆదేశ అధికార ప్రతినిధి హెరు సాంతోసో తెలిపారు. తమ దేశం గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. లేనిపోని కల్పనలు కల్పిస్తున్న ఆయనను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించింది.