
శ్రీదేవి (పాత ఫొటో)
ముంబై: ప్రఖ్యాత నటీమణి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినిమా ప్రపంచాన్నే కాదు ప్రేక్షకలోకాన్ని నివ్వెరపరిచింది. అసమాన నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆమె అకాల మరణం అందరినీ కదిలించింది. అయితే నటనే కాదు ఇంకా పలు అంశాల్లో ఆమెకు ప్రవేశం ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు, చిత్ర పరిశ్రమ నిపుణుడు సుభాష్ కే ఝా వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఫ్యాబులస్ కుక్
శ్రీదేవి వంట బాగా చేస్తుంది. బోనికపూర్‌తో పెళ్లైన తర్వాత ఆయన కోసం వంట నేర్చుకుంది. ఏ పని చేసినా అంకితభావం ప్రదర్శించే శ్రీదేవి కుకింగ్‌ను కూడా అంతే శ్రద్ధగా అలవరచుకుంది. తాను చేసిన వంటలను కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులకు వడ్డించి మురిసిపోయేది.
కుంచె పట్టేది
శ్రీదేవి మంచి చిత్రకారిణి అన్న విషయం చాలామందికి తెలియదు. షూటింగ్ లేని సమయంలో ఆమె పెయింటింగ్ వేసింది. శ్రీదేవి వేసిన ఓ పెయింటింగ్‌ను లండన్‌లోని క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించారు.
జాన్వీ ఫ్యాషన్ టిప్స్
తనిద్దరి కుమార్తెలను ఎంతో ప్రేమించిన శ్రీదేవి వారితో స్నేహితురాలిగా మెలిగేది. పెద్ద కూతురు జాన్వీ నుంచి ఫ్యాషన్ టిప్స్ తెలుసుకునేది. దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయినప్పడు జాన్వీ ఆమె ప్రక్కన లేకపోవడం విషాదకరం.
ముందే చూస్తా
తన పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరపై చూసుకోవాలని శ్రీదేవి ఎంతో ఆరాటపడ్డారు. జాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘ధడక్’ సినిమాపై అమితాసక్తి కనబరిచారు. తన కూతురి సినిమాను ముందుగా వీక్షించే వారిలో తాను కూడా ఉండాలని నిర్మాత కరణ్ జోహార్‌తో గట్టిగా చెప్పారు.
లక్కీ ఛాన్స్
చాందిని సినిమా హిందీలో శ్రీదేవికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. ఈ సినిమాను శ్రీదేవితో తీయాలని యశ్‌చోప్రా ముందు అనుకోలేదు. కొద్ది సంవత్సరాలకు ముందు రేఖతో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. చివరకు శ్రీదేవికి అవకాశం దక్కడంతో బాలీవుడ్‌లో ఆమె అగ్రకథానాయికగా అవతరించారు.
అప్పుడు కుదరలేదు
సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో శ్రీదేవికి మాటల్లో చెప్పలేని అవినాభావ సంబంధం ఉంది. శ్రీదేవి మరణానికి కొద్ది గంటల ముందు ఎందుకో తెలియని అలజడిగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘వీర్ జారా’ సినిమా అమితాబ్, శ్రీదేవి కాంబినేషన్‌లో తెరకెక్కించాలని యాశ్‌చోప్రా భావించారు. పిల్లల కోసం శ్రీదేవి ఈ అవకాశాన్ని వదులుకున్నారు.