బాహుబలి 2 రిలీజ్కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో రెండు వారాలుగా బాహుబలి 2 రిలీజ్ విషయంలో జరుగుతున్న హై డ్రామాకు తెరపడింది. కావేరి జలాల విషయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణతో ఆయన కీలక పాత్రలో నటించిన బాహుబలి 2 రిలీజ్ ను అడ్డుకుంటామంటూ ప్రకటించారు ఆందోళనకారులు. బాహుబలి 2లో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ క్షమాపణ చెపితేనే రిలీజ్ కు అంగీకరిస్తామని ప్రకటించారు.
రాజమౌళి కోరినా కన్నడ ప్రజాసంఘాలు దిగిరాకపోవటంతో కట్టప్ప దిగిరాక తప్పలేదు. శుక్రవారం కట్టప్ప వీడియో మెసేజ్ రూపంలో కన్నడిగులకు క్షమాపణ తెలపటంతో బాహుబలి 2 రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న కన్నడిగులు సత్యరాజ్ క్షమాపణలు చెప్పిన తరువాత ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 28న కర్ణాటకలో కూడా బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది.