మరో భారీ చిత్రంలో కట్టప్ప..!
బాహుబలి తరువాత అంతటి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దక్షిణాది చిత్రం సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేనాండల్ ఫిలింస్ సంస్థ 250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమిళ హీరోలు జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్న ఈసినిమాకు హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. ముందుగా శృతిహాసన్ ను ఫైనల్ చేసినా తరువాత నిర్మాతలతో అభిప్రాయ భేదం రావటంతో ఆమె తప్పుకుంది.
శృతిహాసన్ తరువాత సంఘమిత్ర పాత్రకు చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్, హన్సికను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది. సినిమాలో మరో కీలకమైన పాత్రకు కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్, సంఘమిత్రలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు.