
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడ్డ సత్యరాజ్ తనయ దివ్య సత్యరాజ్ కొద్దిరోజుల క్రితమే డీఎంకే పార్టీలో చేరారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెకు కీలక పదవి అప్పగించారు. ఆ పార్టీ అనుబంధ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటించారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. గతకొంత కాలంగా రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన కుమార్తె దివ్య గత నెలలో డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎంకేలో పలు జిల్లాలకు కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, అనుబంధ విభాగాలకు కొత్త వారి నియామకం వేగం పుంజుకుంది. ఆ దిశగా ఆదివారం ఐటీ విభాగంలో పదవులను భర్తీ చేశారు.
ఇందులో దివ్యకు ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవి అప్పగించారు. అలాగే డీఎంకే అనుబంధ మైనారిటీ విభాగం, వర్తక తదితర విభాగాలతో పాటూ మరికొన్ని విభాగాల పదవులను భర్తీ చేస్తూ దురై మురుగన్ ప్రకటించారు. అలాగే పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ముబారక్‌ను నియమించారు.