‘‘వీళ్లిద్దరూ నా హృదయాన్ని తాకారు. మీ ఇద్దరినీ అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాను అంతే. లియో అండ్ జాక్... నేను మీ అమ్మని అనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఇక ఇది నా వాలెంటైన్ కోసం... నిన్నటితో మనం కలిసి ఐదేళ్లు పూర్తైంది. ఒకనాకొ శుక్రవారం నాడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాతో కలిసి ఈ కుటుంబాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు’’అంటూ బాలీవుడ్ నటి లీసా హెడెన్ తన భర్త, పిల్లల్ని ఉద్దేశించి ప్రేమ పూర్వక సందేశం పోస్ట్ చేశారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తన ఇద్దరు కుమారులు కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా లీసా హెడెన్ ఇటీవలే రెండోసారి తల్లైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన చిన్న కుమారుడికి లియో అని నామకరణం చేసినట్లు శనివారం ఆమె వెల్లడించారు.
కాగా చెన్నైలో పుట్టిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం విదేశాల్లోనే ఉన్న లీసా... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని లీసా వివాహం చేసుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీసా... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment