సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి | Loafer Movie Audio Songs Released | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి

Published Tue, Dec 8 2015 12:19 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి - Sakshi

సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి

- ప్రభాస్
‘‘స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరీగారి చేతుల్లో పడితే చాలు. అందుకే నేను ‘బుజ్జిగాడు’ కోసం ఆరు నెలల వెయిట్ చేశా. వరుణ్ వాళ్ల బాబాయి (పవన్ కల్యాణ్)లా కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’’ అని హీరో ప్రభాస్ అన్నారు.  వరుణ్‌తేజ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘లోఫర్’. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

పాటల సీడీని ప్రభాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీ రాయగల ఒకే ఒక్క బెస్ట్ రైటర్ పూరీగారు. ‘నేను సీన్ తీయాలంటే వంద రోజులు తీయాలి. కానీ ఆ సీన్‌ని పూరి ఓ డైలాగ్‌లో రాస్తారు’ అని రాజమౌళి అన్నారు. దటీజ్ పూరి జగన్నాథ్’’ అని అన్నారు. పూరి తనలోని షేడ్స్ అన్నీ తెర మీద అద్భుతంగా చూపిస్తాడని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.  

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ‘‘నేను కొన్నేళ్ల  క్రి తం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ తీశా. రామూగారు అప్పుడే ముంబై నుంచి మా ఆఫీసుకు వచ్చారు. ఏ సినిమా తీస్తున్నావంటే టైటిల్ చెప్పాను. వెంటనే తిట్టారు. ఆయనకు అలాంటి కథలు ఇష్టం ఉండవు. కానీ  ఈ ‘లోఫర్’ సినిమా చూసి టైటిల్ మార్చి, ‘మా అమ్మ మహాలక్ష్మి’  అని పెట్టమన్నారు. నేనప్పుడే  సక్సెస్ అయ్యాననుకున్నా. చాలా కాలం తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ సినిమా ఇది.

వరుణ్ చిన్నతనం నుంచి మా ముందే పెరిగాడు. అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబుగారిని ‘ఏంటండీ... మీ అబ్బాయి హీరో అవుతాడా?’ అంటే ‘నాకు తెలీదు, వాడికీ తెలియట్లేదు ’అని అన్నారు. ఎనిమిదేళ్ల  క్రితం నా దగ్గరకు వచ్చి డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరతానన్నాడు. కానీ, చివరికి నాకు డెరైక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. వరుణ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. త్వరలో పెద్ద స్టార్ అవుతాడు. నాకిష్టమైన డార్లింగ్ ప్రభాస్ ఈ ఆడియో వేడుకకు వచ్చినందకు అతనికి థ్యాంక్స్.

నేను చాలామంది హీరోయిన్లను హగ్ చేసుకుంటాను. కానీ, ప్రభాస్‌ని హగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది’’ అని చెప్పారు (నవ్వుతూ).  సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ప్రభాస్‌కూ, నాకూ ఓ విచిత్రమైన అనుబంధం ఉంది. తన ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’లో నేను విలన్‌గా నటించా. అప్పటి నుంచి పరిచయం. ‘లోఫర్’తో పూరి నాకో సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నాడు. వరుణ్ భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్‌గారు వచ్చాక ఈ వేడుకకు కళ వచ్చింది. ‘ఈశ్వర్’ సినిమా నుంచి నేనాయనకు అభిమానిని. ఇంటర్  సెకండియర్ చదువుతున్నప్పుడు నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరదామని వెళ్లాను. పూరీగారు తర్వాత రోజు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోగా చేయడం నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్’’ అని అన్నారు.

ఈ వేడుకలో పూరి జగన్నాథ్ చిత్రాల్లోని డైలాగ్స్‌తో సరదాగా ఓ లక్కీ డిప్ నిర్వహించారు. అతిథులతో ఒక్కో డైలాగ్ చెప్పించారు. నాగబాబు, అలీ, నిర్మాతలు డి.సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి, అశోక్‌కుమార్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నటి రేవతి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement