క్రేజీవాలాగా ఎమ్మెస్ నారాయణ
క్రేజీవాలాగా ఎమ్మెస్ నారాయణ
Published Mon, Mar 17 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
అనుకరించడంలో ఎమ్మెస్ నారాయణ కింగ్. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలందర్నీ అనుకరించేశారాయన. ఇప్పుడు ఎమ్మెస్ కన్ను రాజకీయ నాయకులపై పడ్డట్టుంది. సంచలన రాజకీయ నాయకుడు క్రేజీవాలాను గుర్తు చేస్తూ ‘క్రేజీవాలా’గా కనిపించబోతున్నారు. ఎమ్మెస్ ఫస్ట్‌టైమ్ హీరోగా నటిస్తున్న ‘క్రేజీవాలా’ చిత్రం ద్వారా మోహనప్రసాద్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జి.విజయకుమార్ గౌడ్ నిర్మాత. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ముహూర్తపు దృశ్యానికి పరుచూరి గోపాలకృష్ణ దంపతులు కెమెరా స్విచాన్ చేయగా, డా.డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాజ్యాంగం అంటే ఏంటి? అది ఏ ఉద్దేశంతో ఉంది? దాన్ని ఎలా ఉపయోగిస్తే పాలన సక్రమంగా ఉంటుంది? ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలాంటి మార్పు రావాలి? అనే అంశాలను ఇందులో చర్చించనున్నాం. నిజాయితీతో చేస్తున్న దేశభక్తి సినిమా ఇది. ఇందులో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఉండవు’’ అని చెప్పారు.
ఎమ్మెస్ మాట్లాడుతూ -‘‘వర్తమాన సమస్యలతో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. సమస్య, పరిష్కారం.. రెండూ ఇందులో ఉంటాయి’’ అన్నారు. క్రేజీ థాట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాతకు కాసుల వర్షం కురిపించాలని పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని, ఏప్రిల్ మూడోవారంలో సినిమా విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కె.ధరణ్, సంగీతం: సునిల్ కశ్యప్, కళ: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాలాజీ శ్రీను.
Advertisement
Advertisement