తల్లి ప్రొడ్యూసర్‌.. కూతురు డైరెక్టర్‌ | Madha Movie Director Srividya Special Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

తల్లి ప్రొడ్యూసర్‌.. కూతురు డైరెక్టర్‌

Published Tue, Jan 8 2019 9:09 AM | Last Updated on Tue, Jan 8 2019 9:09 AM

Madha Movie Director Srividya Special Chit Chat With Sakshi

తల్లి ఇందిరతో శ్రీవిద్య ,‘మధ’ చిత్రీకరణలో దర్శకురాలు శ్రీవిద్య

శ్రీవిద్య బసవ.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్‌ ఇక్కడే పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌లో చేరిందిఆ తర్వాత మానేసింది. చదువులో డ్రాపవుట్‌ అయినప్పటికీఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోంది. కూతురు కలను నిజంచెయ్యాలనేది శ్రీవిద్య తల్లి ఇందిర తలంపు. చదువు మానేస్తాను,టీవీ షో చేస్తాను, సినిమా తీస్తాను.. ఇలా శ్రీవిద్య ఏం చేస్తానన్నా ఆమె కాదనలేదు. తన తాహతుకు మించి కుమార్తె రూపొందించేచిత్రానికి ప్రొడ్యూసర్‌గా మారింది. త్వరలో విడుదల కానున్న‘మధ’ చిత్రం గురించి ‘సాక్షి’తో శ్రీవిద్య తన అంతరంగాన్నిఇలా పంచుకుంది.

సాక్షి, సిటీబ్యూరో :మా స్వగ్రామం మెదక్‌ జిల్లా జోగిపేట. పుట్టి పెరిగిందతంతా హైదరాబాద్‌లోనే. మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. నేను మూడోదాన్ని. చిన్నప్పటి నుంచి డాక్టరవ్వాలని నా కోరిక ఉండేది పరిస్థితుల కారణంగా ఇంజినీరింగ్‌లో జాయినయ్యా. కానీ మధ్యలోనే మానేశా. 2009 మొదటిసారిగా పెట్స్‌తో క్యూట్‌ కంపానియన్స్‌ అని షో చేశాను. అలా మొదటిసారి విజువల్‌ మీడియాలోకి వచ్చాను. ఈ షో సక్సెస్‌ అయ్యాక చిన్న చిన్న యాడ్స్‌ డైరెక్ట్‌ చెయ్యటం స్టార్ట్‌ చేశాను. ఇలా సుమారు 20 కంపెనీల యాడ్స్‌ చేశాను. కొంతకాలం తర్వాత సినిమాటిక్‌ వెడ్డింగ్స్‌ షూట్‌ చేశాను. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో పాటు వీడియో షూటింగ్, కెమెరా టెక్నిక్స్‌ నేర్చుకున్నాను. 

షూటింగ్‌లో..

‘మధ’కుఅంకురార్పణఅలా..
యాడ్స్‌కి కాన్సెప్టులు రాస్తున్నప్పుడు స్టోరీ ఐడియాలు కూడా వచ్చేవి.  కొత్తగా, బాగా అనిపించిన స్టోరీలు రాసేదాన్ని. ‘మధ’ స్టోరీ కూడా అలా ఆరేళ్ల క్రితం రాసిందే. కొన్ని ప్రొడక్షన్‌ హౌసెస్‌లో వెళ్లి చూపించాను. వారు కొన్ని మార్పులు చేసుకొని రమ్మన్నారు. చేశాను, కానీ నాకు నచ్చలేదు.  2017 మార్చిలో ‘మధ’ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేశాను. ఫీచర్‌ ఫిలిం చెయ్యాలని డిసైడయ్యా. విషయం అమ్మకు చెప్పాను. 6 నెలలు అమెరికాలో వెయిట్రస్‌గా పని చేశాను. కొంత డబ్బు సంపాదించుకొని వచ్చాను. దాంతో సినిమా ప్రారంభించాను.

ఆస్తులు అమ్మి మరీ..
16 నెలల పాటు 4 షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. ఒక్కో షెడ్యూల్‌ కోసం బంగారం, తర్వాత కారు, ఆ తర్వాత భూమి అమ్మేయ్యాల్సి వచ్చింది. ఇలా ఆస్తులన్నీ అయిపోయాక అప్పు తీసుకొని ఫిలిం పూర్తి చేశాం. ఈ ఫిలిం పూర్తిగా, సీరియస్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌. దీనికి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పేరుతో మార్పులు చెయ్యమన్నారు కొందరు. చేసినప్పుడల్లా కథలో మార్పులు సూచించే వారు. చిత్రంలో ప్రతి ఫ్రేమ్, సీన్‌ నేను దగ్గరుండి, నాక్కావలసినట్లు తీయించుకున్నాను. దాంట్లో ఎవరైనా వేలు పెడితే నేను హ్యాండిల్‌ చేయలేను. అందుకే వేరే వారిని ప్రొడ్యూసర్‌గా తీసుకోలేదు. ప్రొడ్యూసర్‌గా మా అమ్మనే ఎంచుకున్నా.

నటీనటులకు సూచనలిస్తున్న శ్రీవిద్య

చిత్ర ప్రత్యేకతలివీ..  
మధ చిత్రం హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథతో సాగుతుంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌ మహిళ, దర్శకురాలు మహిళే. తెలుగు చిత్ర చరిత్రలో తల్లి ప్రొడ్యూసర్‌గా, కూతురు దర్శకురాలిగా పనిచేసిన చిత్రం ఇదే ప్రథమం కాబోలు. తెలుగు చిత్రాల మూస ధోరణి, ముద్ర ఈ చిత్రం మీద పడకూడదని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తమిళం, మలయాళ పరిశ్రమల వారితో చేయించాం. 

‘మధ’ చిత్రీకరణలో దర్శకురాలు శ్రీవిద్య

టైటిల్‌ వెనక ఇదీ కథ.. 
లొకేషన్, హీరో, హీరోయిన్‌ల పేరుతో హర్రర్‌ చిత్రాల టైటిల్స్‌ ఉంటాయి. అలా కాకుండా, సినిమా కాన్సెప్ట్‌ని రిఫ్లెక్ట్‌ చేసేలా టైటిల్‌ పెట్టాలనుకున్నాను. మధ పదం చాలా భాషల్లో ఉంది,  సంస్కృతంలో మధ అంటే పిచ్చితనం. అది ఒక మానవ రూపంలో పరిణమిస్తే అదే మధ. ఈ టైటిల్‌ కోసం ఫిలిం చాంబర్‌లో చాలా పోరాడాల్సి వచ్చింది. తెలుగు టైటిల్‌ పెట్టుకోమని, సంస్కృతం అర్థం కాదు అని ఇలా చాలా చెప్పారు. కానీ వాళ్ల ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి, చాలా కష్టపడి నాక్కావలసిన టైటిల్‌ ఓకే చేయించుకున్నాను. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకుంటున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement