టుస్సాడ్స్ మ్యూజియంలో మధుబాల
బాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోయిన్ కి అరుదైన గుర్తింపు లభించింది. ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ భారతీయ సినీ జనాల మన్ననలు పొందిన బాలీవుడ్ అనార్కలీ.. మధుభాల. 50కి పైగా చిత్రాలలో నటించిన ఈ అందాల తార తన 36వ ఏట 1969 లో కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మధుబాల మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. మధుబాల సోదరి మధుర్ బ్రిజి భూషన్ ఆద్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. అనార్కలీ రూపంలో మధుబాల మైనపు విగ్రహాన్ని రూపొందించారు.
మధుబాల విగ్రహం ఏర్పాటు చేయటం గౌరవంగా భావిస్తున్నామని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీలోని మ్యూజియంలో తన సోదరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మధుర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మధుర్ బ్రిజి భూషన్ అక్కతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం నాకు దొరికినందుకు సంతోషం గా ఉందన్నారు. డిసెంబర్ లో మ్యూజియాన్ని తెరవనున్నారు. 1952లో ఓ ప్రముఖ అమెరికా మ్యాగజైన్ మధుబాల ఫోటోని కవర్ పేజీపై ప్రచురించడంతో అంతర్జాతీయంగా ఆమె పాపులర్ అయ్యింది.