‘బాహుబలి’ కత్తిరింపును ప్రదర్శించొద్దు
మదురై: ‘బాహుబలి’ సినిమా తమిళ వెర్షన్‌లోని సెన్సార్ బోర్డు తొలగించిన కుల ప్రస్తావన భాగాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము జారీ చేసిన ఆర్డర్ కాపీని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.
అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుండా సినిమా ప్రదర్శిస్తే ధియేటర్ల యాజమానులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్డర్ కాపీని తమకు కూడా పంపాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. తమిళ పులి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సి పెరారీవలన్ తో పాటు ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
‘బాహుబలి’లో కొన్ని సంభాషణలు అరుంధతీయ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. మధురైలో బాహుబలి సినిమా పదర్శిస్తున్న ధియేటర్ పై తమిళపులి సంస్థకు చెందిన కార్యకర్తలు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. దీంతో మాటల రచయిత మదన్ కార్గి క్షమాపణ చెప్పారు. ఈ సంభాషణలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి’రూ. 500 కోట్లు పైగా వసూళ్లు సాధించింది.