సాక్షి, చెన్నై: హీరో రాధారవి పిటిషన్ వ్యవహారంలో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. గత ఏడాది దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విశాల్ వర్గం గెలిచిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిని నాజర్, కార్యదర్శి పదవిని విశాల్, కోశాధికారి పదవిని కార్తీ చేపట్టారు. వీరికి ముందు నిర్వాహక బాధ్యతలను నిర్వహించిన అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అవకతవకలకు పాల్పడిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు విశాల్ వర్గం ప్రకటించింది.
దీంతో ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి రాధారవి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పు వెలువడే వరకూ రాధారవిపై చర్యలు ఉండవని ప్రస్తుత నిర్వాహక వర్గం పేర్కొంది. అలాంటిది గత సెప్టెంబర్ 22వ తేదీన హీరో రాధారవిని సంఘ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో ఇది కోర్టు ధిక్కార చర్య అవుతుందని రాధారవి కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు బుధవారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. దక్షిణ భారత నటీనటుల సంఘం తరఫున హాజరైన న్యాయవాది తగిన బదులివ్వడానికి సమయం కోరగా ఈ నెల 19వ తేదీన గానీ, అంతకు ముందుగానీ నటుడు విశాల్ కోర్టుకు హాజరై ఈ కేసు వ్యవహారంలో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment