కథ వినగానే హిట్‌ అని చెప్పా | Maharshi Movie Success Meet | Sakshi
Sakshi News home page

కథ వినగానే హిట్‌ అని చెప్పా

Published Sun, May 19 2019 4:34 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Maharshi Movie Success Meet - Sakshi

‘అల్లరి’ నరేశ్, పీవీపీ, పూజా హెగ్డే, మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, ‘దిల్‌’ రాజు, అశ్వినీదత్‌

‘‘వంశీ పైడిపల్లి ‘మహర్షి’ కథ చెప్పగానే ఈ సినిమా హిట్‌ అని చెప్పా. డెహ్రాడూన్‌లో షూటింగ్‌ మొదటి రోజే ‘పోకిరి’కి రెండింతల హిట్‌ అవుతుందని చెప్పా. నా 25వ సినిమా ఇంత హిట్‌ కావడం చాలా హ్యాపీ. ఈ సినిమాలో స్టూడెంట్‌గా చేయడం బాగా కిక్‌ అనిపించింది’’ అని మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మించారు. మే 9న రిలీజైన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను విజయవాడలోని సిద్ధార్థ మేనేజ్‌మెంట్‌  కాలేజ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించారు.

మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో చేసిన రిషి నాకు బాగా నచ్చిన క్యారెక్టర్‌. విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని, ఇక్కడ ఫంక్షన్‌ చేస్తే ఆ ఫీలే వేరు. నేను ముందుగా అనుకోకపోయినా నా సినిమా హిట్‌ అయినప్పుడల్లా అమ్మ నన్ను పిలుస్తోంది ఇక్కడికి. రాఘవేంద్రరావు మామయ్యగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ‘రాజకుమారుడు’ సినిమా సమయంలో అన్నీ తానే అయి, ఓ స్నేహితుడిలా నాకు నటన నేర్పినందుకు రుణపడి ఉంటాను. ముగ్గురు గొప్ప నిర్మాతలు నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అశ్వినీదత్‌గారు నా మొదటి సినిమా, 25వ సినిమా చేయటం చాలా సంతోషం. సినిమాలో పనిచేసిన నరేష్, పూజా, అందరికీ కృతజ్ఞతలు. 

సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేసిన గురుమూర్తి (వృద్ధ రైతు పాత్ర చేసిన వ్యక్తి) గారి ఆశీస్సులు, దీవెనల వల్లే సినిమాకు ఇంత హిట్‌ లభించింది. నాన్నగారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు నచ్చితే ఎంతలా ఆదరిస్తారో నాకు బాగా తెలుసు. వారం రోజుల్లోనే ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు. మీకు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలను? ఆంధ్రా హాస్పిటల్‌ రామారావుగారు ఇంతకు ముందు చెప్పారు.. పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్‌ అవుతున్నారని. నా జీవితంలో ఇదే గొప్ప కాంప్లిమెంట్‌. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం.  చాలా గొప్పగా చెబుతున్నా.. మీలాంటి వారితో పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా’’ అన్నారు.

‘‘బుద్ధ పౌర్ణమి రోజు మహేశ్‌బాబు అభిమానులకు గొప్ప పండగ. త్రిమూర్తులైన నిర్మాతలకు అభినందనలు. మహేష్‌ 25వ సినిమా హిట్‌ కావడంపై నా వందో సినిమా కన్నా ఎక్కువగా సంతోషపడుతున్నా. వంశీ సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు. రైతులు, స్నేహితుడు, సంపాదన వంటి విషయాలను బాగా చూపారు. మహేశ్‌ నన్ను మామయ్యా అంటే ఇష్టపడతాను, అలానే పిలవాలని కోరుకుంటాను’’ అన్నారు రాఘవేంద్రరావు.

‘‘దేశంలో మనమందరం చల్లగా ఉన్నామంటే కారణం ఇద్దరే. ఒకరు జవాన్, మరొకరు రైతు. అటువంటి రైతుల గురించి సినిమా తీసినందుకు చాలా సంతోషం. ఈ సినిమాను రైతులకు అంకితం చేస్తున్నాను. సినిమా కోసం మూడేళ్ల పాటు మహేశ్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘అల్లరి’ నరే‹శ్‌ చేసిన రవి పాత్ర ఈ సినిమాకు చాలా ముఖ్యమైనది. ఇటువంటి సినిమా చేసే అవకాశం కలిగించిన దిగ్గజ నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా హిట్‌ కావడానికి సహకరించిన నా టీమ్‌కు రుణపడి ఉంటాను. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ సినిమా హిట్‌కి కీలక పాత్ర అయింది’’ అన్నారు వంశీ పైడిపల్లి.

‘‘ఇద్దరు విజయవాడ టైగర్స్‌తో కలసి సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. మే 1న (ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో) కాస్త ఎక్కువగా మాట్లాడాను అనుకున్నవారికి సినిమా హిట్‌తో నేను మాట్లాడింది నిజమని అర్థమై ఉంటుంది. మహేశ్‌ నాకు మరో సినిమాకి డేట్స్‌ ఇస్తే అదే నాకు పెద్ద గిఫ్ట్‌’’ అన్నారు ‘దిల్‌’ రాజు.‘‘మహేశ్‌బాబుతో నేను చేసిన ‘రాజకుమారుడు’ ఇక్కడ అలంకార్‌ థియేటర్‌లో 100 రోజులు, 4 ఆటలతో ఆడి రికార్డ్‌ సృష్టించింది. ఇప్పుడు ‘మహర్షి’ వాటిని మించి బాగా అడుతోంది. అమెరికాలో కొత్త రికార్డ్‌ నెలకొల్పుతోంది. వంశీ, సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు అశ్వినీదత్‌.

‘‘సినిమాను హిట్‌ చేసిన కనకదుర్గమ్మకు, మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు. సినిమా రిలీజ్‌ కాకుండానే హిట్‌ అవుతుందని సక్సెస్‌ మీట్‌ డేట్‌ను ప్రకటించాను.  ఇక మీదట బాబును ‘మహర్షి’ మహేశ్‌ అని పిలవాలి. సూపర్‌ స్టార్‌ అన్నది బిరుదు. మహర్షి అన్నది బాధ్యత. వంశీ తన టీమ్‌తో కష్టపడి గొప్ప విజయాన్ని అందించారు’’ అన్నారు పీవీపీ. ఈ వేడుకలో దర్శకులు వైవీఎస్‌ చౌదరి, అనిల్‌ రావిపూడి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నటులు పృథ్వీరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేత  భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
– ‘సాక్షి’, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement