దూకుడే... ఇక ఆగడు!
‘దూకుడు’, ‘ఆగడు’.. ఈ టైటిల్స్‌కి తగ్గట్టే ఉంది ఇప్పుడు మహేశ్‌బాబు వేగం. ఓ సినిమా పూర్తి చేయడం, మరో సినిమా పట్టాలెక్కించేయడం... ఇలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారాయన. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న ‘ఆగడు’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దాంతో... తన తర్వాత సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లే ముహూర్తాన్ని అప్పుడే ఖరారు చేసేశారు ప్రిన్స్. కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి మహేశ్ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఆగస్ట్ 11న జరుగనుంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. మరి... ఈ సినిమాలో మహేశ్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది, బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కథ ఏ జానర్‌లో ఉంటుంది, కథానాయిక, ఇతర పాత్రధారులు, సాంకేతిక నిపుణుల వివరాలేంటి... ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.