
మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ కూతురు
ఇప్పటికే నటిగా, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న స్టార్ వారసురాలు మంజుల. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అయిన మంజుల 'షో' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత మహేష్ హీరోగా తెరకెక్కిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాలు సాధించింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో చివరి సారిగా కనిపించిన మంజుల తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది.
మంగళవారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి అభిమానులకు మరో తీపి కబురు అందింది. ఇప్పటికే నటిగా, నిర్మాతగా మంచి విజయాలు సాధించిన మంజుల, త్వరలో దర్శకురాలిగా మారనుంది. యంగ్ హీరో నాని కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతోంది మంజుల. ఇప్పటికే కథ విన్న నాని వెంటనే సినిమాను పట్టాలెక్కించడానికి అంగీకరించాడట.
ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్మేన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న నాని, ఆ సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి మరీ.., మంజుల సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడట. నటిగా, నిర్మాతగా సక్సెస్ అయిన మంజుల దర్శకురాలిగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి..?