సాక్షి, విజయవాడ: సూపర్ స్టార్ మహేశ్ బాబు శుక్రవారం విజయవాడలో సందడి చేశారు. ‘భరత్ అనే నేను’ సినిమా విజయం సాధించడంతో మహేశ్ నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. మహేశ్‌తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడలో సినిమా చూడటం సంతోషంగా ఉంది.
ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాల విజయోత్సవ వేడుకలను ఇక్కడే నిర్వహించాం. వందేళ్లు వచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తా. ఇప్పటివరకు నాన్నగారి ఇమేజ్ నాపై పడలేదు. ఈ సినిమాలో నన్ను నాన్నలా చూపించినందుకు కొరటాలకు కృతజ్ఞతలు. భరత్ అనే నేను సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయయాత్రం చేస్తున్నాం.. రాజకీయాల గురించి మాట్లాడను’ అని తెలిపారు. కొరటాల శివ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు విజయవాడలో క్రేజ్ ఉంటుందన్నారు. విజయవాడలో బ్లాక్ బాస్టర్ అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ బాస్టరే అని అన్నారు.
అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన మహేశ్ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు ఎగబడ్డారు. కాగా మహేశ్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలో కూడా అభిమానుల సమక్షంలో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment