నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్ | Mahesh Babu's Srimanthudu Movie Success meet | Sakshi
Sakshi News home page

నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్

Published Mon, Aug 17 2015 7:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్

నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్

నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్...అన్నయ్య మొదటిసారి బొకే ఇచ్చాడు...నిద్రపోయి  పదిహేను రోజులైంది...వెంకీగారు ఇంటికొచ్చి గంట మాట్లాడారు... మహేశ్ బాబుఅన్న మాటలివి. ఇంకా మహేశ్ ఏమేం అంటున్నారో చూద్దాం...

 


 
  ‘శ్రీమంతుడు నాకు క్రూషియల్ మూవీ’ అని విడుదలకు ముందు అన్నారు... రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ టెన్షన్ పడ్డారా?
  సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు ఉందనగా నాకు నిద్ర మాయమైపోయింది. సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకం ఉన్నా ఎందుకో నిద్రపట్టలేదు. విడుదలయ్యాక వచ్చిన హిట్ టాక్‌ని ఆస్వాదించే క్రమంలో ఓ వారం రోజులు నిద్రపోలేదు. మామూలు స్థితికి రావడానికి ఓ రెండు వారాలు పడుతుందేమో (నవ్వుతూ). ఓ పది వారాల తర్వాత ఎంజాయ్ చేయడం మొదలుపెడతాను. ఆగస్ట్ 7 (‘శ్రీమంతుడు’ విడుదలైన రోజు)ని జీవితంలో మర్చిపోలేను. ఓ మిరాకిల్‌లా అనిపిస్తోంది. ఈ సక్సెస్ క్రెడిట్ శివగారికే దక్కుతుంది.
 
  కొరటాల శివ ఈ కథ చెప్పినప్పుడు ఏమైనా లోపాలు కనిపించాయా?
 ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇప్పటివరకూ నా కెరీర్‌లో ఏ లోపాలూ లేని కథ ఇదే. మంచి సందేశంతో ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. అందుకే కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఇది చాలా హానెస్ట్ కాన్సెప్ట్ కాబట్టే, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. మంచి కథలను ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు.
 
  నటుడిగా మీకెలాంటి తృప్తినిచ్చింది.. ఆ మధ్య విడుదలైన ‘1 నేనొక్కడినే’తో ‘శ్రీమంతుడు’ని పోల్చితే..?
 నా పదిహేనేళ్ల కెరీర్‌లో నటుడిగా ఇది నా బెస్ట్ మూవీ అంటాను. ‘1 నేనొక్కడినే’తో పోల్చి చెప్పాలంటే నటుడిగా ‘శ్రీమంతుడు’ సంతృప్తినిచ్చింది.
 
  వంద కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరిందని ట్రేడ్ టాక్.. వసూళ్లు గురించి మీరేమంటారు?
 మంచి కంటెంట్‌తో చేసిన చిత్రం ఇది. వసూళ్ల గురించి మాట్లాడటం రెస్పెక్ట్ కాదు.
 
  ఈ చిత్రానికి మీరు కూడా ఓ నిర్మాత కాబట్టే, భారీగా ప్రచారం చేస్తున్నారా?
 ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. నేను చేసే ప్రతి సినిమా నాకు హార్ట్‌లాంటిది. నేనే సినిమాని ప్రమోట్ చేయడానికి వెనకాడలేదు. కానీ, ఈ సినిమాకి నిర్మాతను కాబట్టే, భారీగా ప్రమోట్ చేస్తున్నానని కొంతమంది అనుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి, జనాలకు దగ్గరవ్వాలనే తాపత్రయంతో ప్రచారం చేశాం.
 
  మీ పిల్లలు గౌతమ్, సితార ఈ సినిమా చూశారా?
 సాధారణంగా నేను యాక్ట్ చేసే సినిమాలను గౌతమ్ చూడడు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూశాడు. చాలా బాగుందన్నాడు. సితార అయితే సినిమాలోని అన్ని పాటలూ పాడేస్తోంది. కొన్ని లిరిక్స్ నాకే తెలియదు (నవ్వుతూ).
 
  ఈ సినిమా చూసి, కృష్ణగారు ఏమన్నారు?
 నాన్నగారు చిన్నపిల్లాడిలాంటివారు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. మహేశ్‌బాబు కెరీర్‌లోనే బెస్ట్ ఫిలిం అని శివగారితో అన్నారు. నాతోనూ అలానే అన్నారు. నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి.
 
  మీ రియల్ లైఫ్ అన్నయ్య (రమేశ్ బాబు), రీల్ బ్రదర్ (వెంకటేశ్) ఏమన్నారు?
 మా అన్నయ్య బొకే ఇచ్చి మరీ అభినందించాడు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో అన్నయ్య బొకే ఇవ్వడం ఇదే తొలిసారి. విచిత్రంగా అనిపించింది. ఇక, మా పెద్దోడు (వెంకటేశ్) ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’ అని ఇంటికొచ్చారు. ఓ గంటసేపు మాట్లాడారు. సినిమా బాగుందని, బాగా యాక్ట్ చేశావని అభినందించారు.
 
  ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్‌లో మీరు బాగా యాక్ట్ చేశారని అందరూ అంటున్నారు.. హోమ్‌వర్క్ ఏమైనా చేశారా?
 ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేను హోమ్‌వర్క్ చేయలేదు. నేను హోమ్‌వర్క్ చేయడం అంటే డెరైక్టర్‌తో ఇంటరాక్ట్ కావడమే. ఈ కథలో మంచి సోల్ ఉంది. అందుకే ఎమోషన్ సీన్స్ బాగా చేయగలిగాను. ఆ సీన్స్‌లో నటించడం పూర్తయ్యాక మా డెరైక్టర్, కెమెరా అసిస్టెంట్ తదితరులను చూస్తే, వాళ్ల కళ్లల్లో నీళ్లు ఉండేవి. దాంతో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారని అనిపించింది.
 
  పొలిటీషియన్స్ నుంచి కామన్ మ్యాన్ వరకు ఈ చిత్రాన్ని చాలామంది అభినందించడం ఎలా ఉంది?
 మిరాకిల్‌లానే ఉంది. మహేశ్‌బాబు జడ్జిమెంట్ అద్భుతం అని, హ్యాట్సాఫ్ అని అంటున్నారు. కొంతమందైతే ఇలాంటి కథతో సినిమా చేయడం రిస్క్ అన్నారు. ‘శ్రీమంతుడు’ చేసినప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ, ఇప్పుడీ మాటలు వింటుంటే భయమేస్తోంది. యాక్చువల్‌గా నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు చూసినంత ఎక్కువగా వేరేవాళ్లు సినిమాలు చూడరు. మంచి సినిమా చేస్తే ‘ఆకాశమే హద్దు’ అన్నది ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది.
 
  ‘శ్రీమంతుడు’లో సైకిల్ తొక్కారు కాబట్టి.. ఈ మధ్య వాటికి డిమాండ్ పెరిగింది... విడిగా కూడా మీరు సైకిల్ తొక్కుతున్నారా?
 శివగారు సైకిల్ కాన్సెప్ట్ చెబితే, కొత్తగా అనిపించి, చేశాను. డిమాండ్ పెరిగితే మంచిదే. ఇక, సినిమాలో తొక్కాను కదా అని.. విడిగా కూడా సైకిలేసుకుని నేను రోడ్ల మీద వెళితే పిచ్చోడనుకుంటారు (నవ్వుతూ).
 
  లుంగీలో కనిపించడం కూడా మీ అభిమానులకు బాగా నచ్చింది?
 వాస్తవానికి ఈ మధ్య చేసిన సినిమాల్లో దర్శకులు లుంగీ సీన్ పెట్టాలనుకున్నారు కానీ, కథకు కనెక్ట్ కాలేదు. ఈ కథలో వచ్చిన పాటకు కుదరడంతో ఓకే అన్నాను. లుంగీ కట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది కానీ, రెస్పాన్స్ బాగుంది.
 
  గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో సాగే సినిమా ఇది. మీ సొంత ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకుంటాననన్నారు కదా.. అదేమైంది?
 ‘శ్రీమంతుడు’ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక మా బావ (గల్లా జయదేవ్) బుర్రిపాలెంని దత్తత తీసుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు తీసుకుంటే పబ్లిసిటీ స్టంట్ అంటారు. అందుకే ఆగాను. ఇప్పుడు మా బావతో కలిసి ఆ విషయం గురించి చర్చిస్తున్నాను. మరో రెండు నెలల్లో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
 
  ఈ చిత్ర విజయం మీరు తదుపరి చేయబోయే ‘బ్రహ్మోత్సవం’పై భారీ అంచనాలు పెంచుతుంది కదా?
 ఇంకా ‘శ్రీమంతుడు’ విజయాన్నే ఆస్వాదించలేదు. తదుపరి చిత్రం గురించి అడిగి, అప్పుడే ప్రెజర్ మొదలుపెట్టేస్తున్నారు (నవ్వుతూ). వచ్చే నెల ఆ చిత్రం ఆరంభమవుతుంది. అందుకని ఇప్పుడే ఆలోచించడంలేదు.
 
 ‘మంచి హీరోయిజమ్’ ట్రెండ్ మళ్లీ మొదలైంది - రాజేంద్రప్రసాద్

  రాజేంద్రప్రసాద్: ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణగార్ల టైమ్‌లో హీరోయిజమ్ అంటే పాజిటివ్‌గా ఉండేవి. వాటి ప్రభావం జనాల్లో చాలా ఉండేది. ఆ తర్వాత తర్వాత నరుక్కోవడం, చంపుకోవడం ఎక్కువైంది. ఇప్పుడు మళ్లీ ఆ పాత హీరోయిజమ్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన చిత్రం ‘శ్రీమంతుడు’. మహేశ్‌బాబు నటించిన చిత్రాల్లో ‘ఒక్కడు, ‘అతడు’, ‘పోకిరి’ నాకు చాలా ఇష్టం. మహేశ్ ఈ చిత్రంలో ఇంకా మెచ్యుర్డ్‌గా నటించాడు.
 
 జగపతిబాబు: ఇందులో నాది రిచ్ ఫాదర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌ని శివ సరిగ్గా తీసి ఉండకపోతే పిచ్చి ఫాదర్‌లా కనిపించి ఉండేవాణ్ణి. సినిమాలో మహేశ్ నన్ను ‘అండీ’ అని పిలవడం చాలా బాగుంటుంది. నేను తండ్రి పాత్రలే చేస్తానని చాలామంది ఫిక్సయినట్లున్నారు. కానీ, అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. జుత్తుకి రంగు వేసుకుంటే హీరోగానూ చేయొచ్చు (నవ్వుతూ).
 
 కొరటాల శివ: పరీక్షలు బాగా రాయనివాడికి ఏ టెన్షనూ ఉండదు. ఎలాగూ రిజల్ట్ ముందే ఊహిస్తాడు. ఎటొచ్చీ బాగా రాసినవాళ్లకే టెన్షన్ అంతా. మేం ‘శ్రీమంతుడు’ అనే పరీక్ష బాగా రాశాం. కొంచెం టెన్షన్‌గా, పాజిటివ్‌గా రిజల్ట్ కోసం ఎదురు చూశాం. పాజిటివ్ మైండ్‌తో చేస్తే, పాజిటివ్ రిజల్టే వస్తుందని ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రాన్ని అంగీకరించిన మహేశ్‌బాబుకి ధన్యవాదాలు. మా ఊళ్లో శ్రీమంతులు కూడా సైకిల్ తొక్కుతుంటారు. ఆ పాయింట్‌నే ఇందులో పెట్టాను.

 నవీన్: 2014 ఏప్రిల్ 18న మహేశ్‌బాబుతో మా బ్యానర్లో ‘శ్రీమంతుడు’ సెట్ అయ్యింది. అప్పుడెంత ఆనందపడ్డామో.. ఈ సినిమా విజయానికి అంతే ఆనందపడుతున్నాం. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రంగా నిలిచిపోయింది. తమిళ, మలయాళ భాషల్లో కూడా బాగా ఆడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement