శేఖర్ కమ్ములతో మహేశ్? | Mahesh with Sekhar Kammula? | Sakshi
Sakshi News home page

శేఖర్ కమ్ములతో మహేశ్?

Published Fri, Jul 3 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

శేఖర్ కమ్ములతో మహేశ్?

శేఖర్ కమ్ములతో మహేశ్?

హీరో మహేశ్‌బాబు ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఒకపక్క ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోపక్క తరువాత సినిమాల ప్లానింగ్ స్పీడ్‌గా చేసేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో మహేశ్ జన్మదిన కానుకగా ‘శ్రీమంతుడు’ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే తరువాత నటించే రెండు చిత్రాల ప్లానింగ్ సిద్ధమైంది. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో మహేశ్ పాల్గొననున్నారు. ఇప్పుడు తాజా కబురేమిటంటే, దర్శకుడు శేఖర్ కమ్ములతో మరో సినిమాకు కూడా ఈ ప్రిన్స్ సిద్ధమవుతున్నారట! అందుకు తగ్గట్లే శేఖర్ కమ్ముల, మహేశ్‌ల మధ్య చర్చలు జరిగాయనీ, ప్రాథమికంగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందనీ కృష్ణానగర్ కబురు.

 ‘ఆనంద్’, ‘లీడర్’ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో సినిమాకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి, ‘గోదావరి’ సినిమాను మహేశ్‌తోనే తీయాలని అప్పట్లో శేఖర్ కమ్ముల భావించారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినప్పటికీ, శేఖర్‌తో సినిమాకు మహేశ్ ఆసక్తి చూపుతూ వచ్చారు. కానీ, ఆ ప్రయత్నం అలా అలా వాయిదా పడుతూనే వచ్చింది.

 ఇది ఇలా ఉండగా, గత ఏడాది మొదట్లో రిలీజైన మహేశ్ సినిమా ‘1... నేనొక్కడినే’ పోస్టర్ వ్యవహారం వారి మధ్య కొంత గ్యాప్‌ను పెంచినట్లు సినీజనం చెవులు కొరుక్కున్నారు. ఆ పోస్టర్ ఆడవారిని ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉందంటూ నటి సమంత చేసిన వ్యాఖ్యను శేఖర్ కమ్ముల కూడా సమర్థించారు. ఆ వ్యవహారంతో సంబంధాలు కొంత దెబ్బతిన్నప్పటికీ, క్రమంగా మళ్ళీ సత్సంబంధాలు నెలకొన్నాయట! ప్రస్తుతం మహేశ్‌తో శేఖర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందట!

ఆ స్క్రిప్ట్ పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారట! ‘బ్రహ్మోత్సవం’లో నిర్మాణ భాగస్వామి కూడా అయిన మహేశ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తారన్న క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ కొత్త సినిమాకు కూడా మహేశ్ నిర్మాణంలో పాలుపంచుకుంటారా? సెన్సిబుల్ ఫీల్ గుడ్ స్టోరీలు తెరకెక్కించే శేఖర్ కమ్ములకూ, కమర్షియల్ హీరో మహేశ్‌కు లంకె కుదిర్చే ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రస్తుతానికి సస్పెన్సే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement