
విడాకుల బాటలో మలైకా అరోరా?
హిందీ సినీ గీతాల్లో ఇటీవల మాస్ నోట పదే పదే వినిపిస్తున్న గీతం - ‘మున్నీ బద్‌నామ్ హుయీ...’ ఆ పాట, ఆ పాటకు మలైకా అరోరా చేసిన డ్యాన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఒకప్పుడు వీడియో జాకీగా పేరున్న 42 ఏళ్ళ ఈ అందగత్తెకూ, ప్రత్యేక ఆకర్షణ నిండిన ఆమె నృత్య గీతాలకూ అంతటి అవినాభావ సంబంధం. ప్రముఖ నటుడు - నిర్మాత అర్బాజ్ ఖాన్, నటి మలైకాలు భార్యాభర్తలన్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరి మధ్య బంధం ఇప్పుడు బెడిసికొట్టిందా? పరిస్థితి విడాకుల దాకా వెళ్ళిందా? అవుననే అంటున్నారు - పరిశీలకులు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఫ్యాషన్ ప్రదర్శనలో మలైక అందమైన దుస్తుల్లో మెరిసిపోయారు.
ఈ సందర్భంగా, వినిపిస్తున్న విడాకుల వార్తల గురించి ప్రస్తావించగా, ఆమె మాత్రం చిరునవ్వులు చిందించారే తప్ప, పెదవి విప్పలేదు. దాంతో, ఇప్పుడీ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. నిజానికి, గడచిన కొద్ది నెలలుగా మలైకా, అర్బాజ్ ఖాన్‌ల వివాహం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ, 18 ఏళ్ళుగా వైవాహిక బంధంలో కొనసాగుతూ, 13 ఏళ్ళ కొడుకు (అర్హాన్) కూడా ఉన్న ఈ దంపతులు బాహాటంగా దాని గురించి నోరు విప్పలేదు. చివరకు, అర్బాజ్ ఖాన్ తండ్రి, ప్రసిద్ధ స్క్రిప్ట్ రచయిత అయిన సలీమ్ ఖాన్ (ఒకప్పుడు భారతీయ సినీసీమను ఏలిన సలీమ్ - జావేద్ జంటలో ఒకరు) సైతం కొడుకూ కోడళ్ళ గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. మొత్తానికి, వ్యవహారం చూస్తుంటే, ఏదో తేడాగానే ఉంది. నిప్పు లేనిదే ఇంత పొగ రాదు కదా!