కంటతడి పెట్టా
మంజాపై చిత్ర కథ విన్నప్పుడే కంటతడి పెట్టానని చిత్ర నిర్మాత, దర్శకుడు లింగుసామి చెప్పారు. విమల్, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం మంజాపై. నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా రాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు లింగుసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ పతాకంపై ఆయన సోదరుడు ఎన్.సుభాష్ చంద్రబోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ ఆరో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగుసామి మాట్లాడుతూ దర్శకుడు రాఘవన్ కథ చెప్పినప్పుడే తాను కంటతడి పెట్టానన్నారు.
అంతగా కదిలించిన చిత్ర కథ ఇదన్నారు. తాతా మనవళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించిన చిత్రం మంజాపై అని చెప్పారు. తాతగా రాజ్‌కిరణ్, మనవడిగా విమల్ జీవించారని చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ఇంతకు ముందు తమ సంస్థ నుంచి వచ్చిన కుంకీ, లక్కుఎన్ 18/9, గోలిసోడా చిత్రాల వరుసలో చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశా రు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అని, దర్శకుడు రాఘవన్ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారని నటుడు రాజ్‌కిరణ్ తెలిపారు. జీఆర్ వెంకటేశ్, ఎ.నందకుమార్‌తో సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎన్.ఆర్.రఘునందన సంగీతాన్నందించారు.