భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..
భువనేశ్వర్/కటక్: గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా(గాజు పెంకుల పొడి) పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కటక్–చాంద్బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్పై వెళ్తున్న జయంత్ సామల్(31)పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.
అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)
గాలిపటం దారానికి గాజు పెంకుల పొడి పూస్తున్న దృశ్యం
దుకాణానికి వెళ్తుండగా..
పూరీ పట్టణంలో వెలుగుచూసిన మరో గాలిపటం దుర్ఘటనలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక బొడొదండొలో మందుల దుకాణానికి వెళ్తుండగా, తెగిన గాలిపటం అతడి మెడ భాగం కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భంజబిహారి పాత్రో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఏడేళ్లలో ముగ్గురు మృతి..
గడిచిన ఏడేళ్లలో ఒక్క కటక్ నగరంలోనే గాలిపటంతో పీక తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం, 10 మందికి పైగా గాయాలపాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పురస్కరించుకుని, జరుపుకునే గాలిపటాల పండుగ మరెంతమందిని విషాదంలోకి నెడుతుందోనని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం మాంజా అమ్మకాలపై నిషేధం విధించినా పలుచోట్ల వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండడం గమనార్హం.
చదవండి: (Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం)
మాంజా తయారీ..
సాధారణంగా సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న తరుణంలో గాలి పటాల సందడి ప్రారంభమవుతుంది. నింగికెగసి రెపరెపలాడుతూ ఎగిరే గాలి పటాల మధ్య పోటీ కోసం దారం పదును పెడతారు. ఫుడ్ కలర్ కలిపిన బంకలో గాజు పెంకుల పొడిని జోడించిన మిశ్రమం దారపు పోగును బలంగా చేసేందుకు పూస్తారు. ఎండలో ఇది ఆరిన తర్వాత గాలి పటానికి కట్టి ఎగురవేస్తారు. ఈ ప్రక్రియని మాంజాగా పేర్కొంటారు. గాలిలో జరిగే ఈ పోటీలో ఎవరి గాలి పటం తెగితే ఆ అభ్యర్థి ఓడినట్లే. ఇలా తెగిన గాలి పటం గాలిలో తేలియాడుతూ నేలను చేరుకునే క్రమంలో ఆ ప్రాంతంలోని ఎవరికో ఒకరికి తగిలి, ప్రమాదం తెచ్చిపెడుతోంది. సాధారణంగా మెడ ప్రాంతంలో గాలిపటం దారం కోసుకుపోతుండడంతో ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు..
గాలి పటం తెగడంతో కటక్ ప్రాంతంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఐపీసీ 304–ఎ సెక్షన్ కింద జగత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయా సడక్, నంది సాహి ప్రాంతాల్లో పూరీ ఘాట్ ఠాణా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విచారకర సంఘటనతో నగర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టినట్లు కటక్ నగర డీసీపీ ప్రతీక్ సింఘ్ తెలిపారు. గాలి పటాలు, మాంజా దారం విక్రేతలను పలుచోట్ల అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటుండడం విశేషం. ముఖ్యంగా మాంజా తయారీదారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తారు. గాలి పటాల దుకాణాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతున్నట్లు డీసీపీ తెలిపారు. మాంజా దారాల విక్రయం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
పూరీ సంఘటనపై కేసు నమోదు
భువనేశ్వర్/పూరీ: పూరీ బొడొదండొ ప్రాంతంలో జరిగిన గాలిపటం దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ–337, ఐపీసీ–338 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పూరీ కుంభార్పడా ఠాణా పోలీసులు తెలిపారు.