![Manjima Mohan React On Her Love Secret With Rishi - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/28/manjima-mohan.jpg.webp?itok=TpZTJ_gh)
తమిళసినిమా: అంగాంగ ప్రదర్శనకు పేరు గ్లామర్ కాదు అంటోంది యువ నటి మంజిమామోహన్. అచ్చం యన్బదు మడమైఇల్లడా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన మలయాళ భామ ఈమె. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందు పోగుమ్, ధనుష్ సరసన పవర్ పాండి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించినా ఎందుకనో అంత బిజీ నాయకి కాలేకపోయింది. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్‌తో దేవాట్టం చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా నటి మంజిమామోహన్‌తో చిట్‌చాట్..
ప్ర: నటుడు గౌతమ్‌కార్తీక్ నటించిన అడల్ట్ కామెడీ చిత్రం ఇరుట్టు అరైయిల్ మురట్టు చిత్రం గురించి మీ అభిప్రాయం?
జ: నాకేం చెప్పాలో తెలియడం లేదు. గౌతమ్ కార్తీక్ ఇటీవల నటించిన రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాలను నేను చూడలేదు. అయితే చాలా విషయాలు విన్నాను. ప్రేక్షకులకు ఆ చిత్రాలు నచ్చాయి. ఇలాంటి మార్పును ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. అయితే అలాంటి చిత్రాలు మాత్రమే కాకుండా వైవిధ్యభరిత కథాచిత్రాలన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి నా సొంత అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాను.
ప్ర: మంజిమామోహన్ రొమాన్స్ రహస్యం గురించి?
జ: నాకు రొమాన్స్ రహస్యం అంటూ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అందుకు టైమే లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే. మంచి చిత్రాల్లో నటించాలి. మీరన్నట్టే అలాంటిదేమైనా ఉంటే మొదట అమ్మానాన్నలకు చెబుతాను. ఆ తరువాత మీకే తెలుస్తుంది. ఇతనే నీకు భర్త అని నా మనసు చెప్పాలి. ఇప్పటి వరకూ ఎవరినీ అలా నా మనసు చెప్పలేదు. అలా చెప్పినప్పుడు చూద్దాం. ఇంకో విషయం చెబితే మీరే ఆశ్చర్యపోతారు. నాకింత వరకూ ఎవరూ ఐలవ్‌యూ చెప్పలేదు. నా స్నేహితుల ద్వారానే రాయబారం పంపారు. అలాగే ఎవరైనా చెప్పినా వెంటనే ఓకే చెప్పే మనస్తత్వం నాది కాదు. తొలి చూపులోనే పుట్టే ప్రేమపై నాకు నమ్మకం లేదు.
ప్ర: అందాలారబోత లేకుండా కథానాయికలు నిలదొక్కుకోవడం సాధ్యమా?
జ: నా దృష్టిలో గ్లామర్‌కు అంగాంగ ప్రదర్శనకు వ్యత్యాసం ఉంది. ఒళ్లు చూపించి నటించడం నా వల్ల కాదు. నా శరీర సౌష్టవానికి అది నప్పదు కూడా. చీర ధరించి కూడా శృంగారాన్ని ఒలకబోయవచ్చు. పాత్రకు అవసరం అయితే దాన్ని నేను చేయగలను. కథ చెప్పినప్పుడే ఈ విషయం గురించి దర్శక నిర్మాతలతో స్పష్టంగా చర్చిస్తాను.
ప్ర: నటుడు రిషీతో ప్రేమాయణం అంటూజరుగుతున్న ప్రచారం గురించి?
జ: రిషీ నాకు క్లోజ్ ఫ్రేండ్ అని మాట వరసకు చెప్పను. తను నిజంగానే నాకు మంచి స్నేహితుడు.. నేను ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నానంటే కనీసం అలాంటి ఫొటో అయినా బయట పడాలి.అలాంటిదేమీ లేకుండా కొందరు కథలల్లుతున్నారు.కాబట్టి అలాంటి వదంతుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment