
మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కుదేలయ్యింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండటం, రోడ్లు కొట్టుకుపోతుండటం వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌తో పాటు చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 30 మంది ఉన్న ఈ బృందం చట్రూ కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అవార్డు విన్నింగ్ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వీరంతా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అయితే భారీ వరదల మూలానా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోవడంతో మంజు, ఇతర సభ్యులు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం.
దీని గురించి మంజు వారియర్ సోదరుడు మధు మాట్లాడుతూ.. ‘సనల్ కుమార్, మంజు, ఇతర చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్‌ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదు. సోమవారం రాత్రి నా సోదరి నాకు శాటిలైట్ ఫోన్ నుంచి కాల్ చేసింది. తామంతా క్షేమంగానే ఉన్నామని చెప్పింది. కానీ సరిపడా ఆహారం లేదు. కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంది. తక్షణమే తమకు సాయం అందేలా చూడమని కోరింది. ఈ విషయాన్ని మంత్రి వి మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీని గురించి హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంప్రదింపులు జరుపుతున్నాను అన్నారు’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment