సామాన్యుడు ‘బిగ్ బాస్’ అయ్యాడు
ముంబై: మూడు నెలల పాటు ఉత్కంఠభరితంగా సాగిన సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్-10లో సామాన్యుడు విజేతగా నిలిచాడు. హర్యానాకు చెందిన మన్ వీర్ గుజ్జర్ విజేతగా అవతరించాడు. తన స్నేహితుల పట్ల అతడు చూపిన నిజాయితీ, అంకితభావంతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు అతడికి మద్దతుగా నిలిచారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి, మోడల్, ఎంటీవీ వ్యాఖ్యాత గుర్బానీ జడ్జ్ ను దాటుకుని మన్ వీర్ ‘బిగ్ బాస్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
మన్ వీర్ ను సల్మాన్ ఖాన్ విజేతగా ప్రకటించగానే అతడి తండ్రి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ప్రైజ్ మనీగా వచ్చే రూ. 40 లక్షల మొత్తాన్ని తన కుమారుడు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపాడు. సల్మాన్ ఖాన్ ఆర్గనైజేషన్ కు ఇస్తామని ప్రకటించాడు.
తాను నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతానని మన్ వీర్ చెప్పాడు. ‘నేను గెలిచిన తర్వాత అందరూ నన్ను పొగుడుతున్నారు. నన్ను స్టార్ లా చూస్తున్నారు. సామాన్య వ్యక్తిలా ఉండడమే నాకు ఇష్టమ’ని మన్ వీర్ తెలిపాడు. బిగ్ బాస్-10 ముగింపు కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, యామి గౌతమ్ తో పాటు పోటీదారుల ఆటపాటలు అలరించాయి.