పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.
బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు.
బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్‌కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్‌కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి..
కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది.
అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్‌కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది .