
మా మధ్య బోల్డన్ని గొడవలు!
ఒక్కరు కాదు... ఇద్దరు స్నేహితురాళ్లను పొందిన అదృష్టవంతురాల్ని నేను. నా స్కూల్ ఫ్రెండ్స్ అనూష, మేఘన అంటే నాకు చాలా ఇష్టం. అనూష యూఎస్‌లో లాయర్‌గా చేస్తోంది. తను యూఎస్ వెళుతున్నప్పుడు తెగ బాధపడిపోయాను. తన పరిస్థితి కూడా అంతే. నేను యూఎస్ వెళితే, వీలు చేసుకుని అనూషను కలుస్తాను. ఇక, నా మరో స్నేహితురాలు మేఘన గురించి చెప్పాలి. తను మలేసియాలో ఉంటోంది. పెళ్లయిపోయింది.
ఇండియా వస్తే నన్ను కలవకుండా వెళ్లదు. మలేసియా వెళితే తనని కలవకుండా నేను ఇండియా రాను. ఇతరులకు అసూయ పుట్టించేంత స్నేహితులం మేం. అలాగని, గొడవలు పడమని అనుకోవద్దు. అనూషతో రెండుసార్లు చాలా గట్టిగా గొడవపడ్డాను. మేఘనకు, నాకూ మధ్య ఓసారి గొడవ జరిగింది. ఓ రెండు, మూడు రోజులు ఎడమొహం పెడమొహంగా ఉండి, ఆ తర్వాత ‘సారీ’ చెప్పేసుకుని మాట్లాడేసుకున్నాం. వాళ్లతో గడిపిన క్షణాలే కాదు.. ఆ గొడవలు కూడా నాకు తీపి జ్ఞాపకాలే.