డ్వేన్ జాన్సన్
ప్రముఖ హాలీవుడ్ నటుడు, మాజీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ డ్వేన్ జాన్సన్ మరణించారనే పుకార్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. దీంతో మరోసారి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర నిర్మాత డ్వేన్ బాధితుడిగా మారారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని కన్నుమూశారనే వార్తలు రావడం సినీ ఇండస్ట్రీలో కొత్తేమి కాదు, గతంలోనూ చాలా సార్లు అలా జరిగింది.
డ్వేన్ 'ది రాక్' జాన్సన్ ఘోరంగా విఫలమైన స్టంట్ కారణంగా మరణించాడని బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రముఖ మీడియా సంస్థ అయిన బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) న్యూస్ లోగోను ఉపయోగించుకుని..యూట్యూబ్‌తో సహా పలు సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు.
'బీబీసీ: డ్వేన్ 'ది రాక్' జాన్సన్ 47 ఏళ్ల వయసులో స్టంట్ విఫలమైన కారణంగా అకాల మరణం చెందారని' ఒక వీడియోను పోస్ట్ చేశారు. బీబీసీ ప్రామాణికమైన వార్తా సంస్థ కావడంతో.. చాలామంది ప్రజలు, డ్వేన్ అభిమానులు ఈ వార్తను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొంతమంది ట్విటర్ మాధ్యమంగా డ్వేన్ అభిమానులు.. మరణించారనే వార్తను ధృవీకరించమని కోరారు. మరణించారనే తప్పుడు వార్తలపై స్పందించని డ్వేన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. దీంతో డ్వేన్ ప్రాణాలతో ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
జాన్సన్ మరణించాడని వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2011లో ఫేస్‌బుక్‌లో ఈ మాజీ వరల్డ్ రెజ్లింగ్ మెగా స్టార్ చనిపోయారంటూ పుకార్లు వచ్చాయి. అలానే 2014లో కూడా ఇదే విధమైన చేదు అనుభవం ఎదురైంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్7 చిత్ర షూటింగ్ సమయంలో ఒక స్టంట్ చేసే ప్రయత్నంలో నటుడు డ్వేన్ మరణించారనే అసత్య ప్రచారం జరిగింది.
కాగా డ్వేన్ ప్రస్తుతం నటిస్తున్న 'బ్లాక్ ఆడమ్' అనే చిత్రం 2021లో క్రిస్మస్ పండుగకు విడుదల కానుంది. ఇందులో తన పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని, ఎల్లప్పుడు యాక‌్షన్ సీన్స్ చేసే తాను.. ఈ చిత్రంలో అందుకు భిన్నంగా ఓ వైవిధ్యభరితమైన పాత్రలో నటించానని తెలుపుతూ.. బ్లాక్ ఆడమ్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ను డ్వేన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment