ధ్రువకు జోడీ కుదిరింది! | Megha Chaudhary In Tamil Varma Movie | Sakshi
Sakshi News home page

ధ్రువకు జోడీ కుదిరింది!

Published Thu, Jul 5 2018 9:02 AM | Last Updated on Thu, Jul 5 2018 9:02 AM

Megha Chaudhary In Tamil Varma Movie - Sakshi

మేఘా చౌదరి

తమిళసినిమా: కొన్ని చిత్రాలకు కథానాయికలు త్వరగా దొరకరు. కారణం దర్శక నిర్మాతలకు నచ్చకపోవడం కావచ్చు. కథానాయకులకు సెట్‌ కాకపోవచ్చు. ఆయా పాత్రలకు నప్పకపోవచ్చు. ఇంకేదైనా కావచ్చు. అలా నవ నటుడు ధ్రువ విక్రమ్‌కు జంటగా నటించే హీరోయిన్‌ కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతోంది. ధ్రువ విక్రమ్‌ అనగానే అతను హీరో విక్రమ్‌ వారసుడని ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ యువ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఈ చిత్రం రీమేక్‌. విజయ్‌ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ విక్రమ్‌ పోషిస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో నిర్మిస్తున్నారు.

విశేషం ఏంటంటే హీరోయిన్‌ ఎంపిక కాకుండానే ఈ చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు దర్శకుడు బాలా. తెలుగులో శాలినీపాండే నటించిన పాత్రను తమిళంలో పోషించే నటి కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికింది. పలువురు నటీమణులను పరిశీలించారు. చాలామంది పేర్లు ప్రచారమయ్యాయి కూడా. చివరికి బెంగాలీ బ్యూటీకి ఆ అదృష్టం దక్కింది. బెంగాలీలో పలు టీవీ, మూవీ చిత్రాల్లో నటించిన మేఘాచౌదరి వర్మ చిత్రంలో ధ్రువ్‌తో రొమాన్స్‌ చేయనుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్‌లోనూ నటించింది. మోడల్‌గా రాణించిన మేఘా చౌదరి తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘చిల్లన్ను ఒరు కాదల్‌’ చిత్రంలో ఆయన కూతురిగా నటించిందన్నది గమనార్హం. తాజాగా వర్మ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మరి ఇక్కడ కథానాయకిగా ఏ పాటిగా నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలో ప్రారంభం కానున్న వర్మ చిత్ర షూటింగ్‌ రెండవ షెడ్యూల్‌లో మేఘా చౌదరి పాల్గొననుందన్నది తాజా సమాచారం. ఇ4 ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజుమురుగన్‌ సంభాషణలను రాస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement