గాయని చిన్మయి (ఫైల్ ఫోటో)
హాలీవుడ్‌లో రాజుకున్న ‘మీటూ’ ఉద్యమం భారత్‌లోనూ కలకలం సృష్టిస్తోంది. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ట్విటర్‌లో మోతమోగుతున్నాయి. పలువురు ప్రముఖ మహిళా జర్నలిస్టులు, రచయితలతో పాటు ఇతర సెలబ్రిటీలు తమకు ఎదురైన వేధింపులను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేశాయి. ఇటీవల తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదంతోనే మీటూ ఉద్యమం భారత్‌లో అగ్గిరాజైంది. గాయని చిన్మయి షేర్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
8 ఏళ్ల వయసులోనే వేధింపులు...
అసభ్యకరంగా పురుషులు తాకిన సంఘటనలను మహిళలు గుర్తు చేసుకోవడం చాలా చాలా కఠినతరమని, చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులను, అసభ్యకరంగా తాకిన సంఘటనలను ఎదుర్కొన్నానని చిన్మయి చెప్పారు. ‘నాకు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అనుకుంటా. నేను నిద్రపోతున్నాను. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్ సెషన్‌ను పర్యవేక్షిస్తున్నది. పూజారి దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి నన్ను అసభ్యకరంగా తాకినట్టు నాకు అనిపించింది. వెంటనే లేచి, అమ్మా ఈ అంకుల్ చాలా చెడ్డవాడు అని చెప్పేశా. ఆ సంఘటన శాంతోమ్ కమ్యూనికేషన్స్ స్టూడియోలో జరిగింది. ఆ స్టూడియో ఇప్పటికి ఉంది’ అదే నా మొదటి భయంకరమైన అనుభవమంటూ చిన్మయి ట్విటర్ వేదికగా తెలిపారు. అలా చిన్నప్పుడే తనకు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
సంఘంలో ఎంతో గౌరవమున్న వ్యక్తే అలా ప్రవర్తించాడు...
‘చెన్నైలో డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఓ పెద్ద మనిషి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పుడు నాకు 10 ఏళ్లు ఉంటాయి. అంతేకాక ఆ తర్వాత కూడా సంఘంలో ఎంతో గౌరవమున్న ఓ వ్యక్తి నన్ను ఆఫీసుకు రమ్మని చెప్పి, అనుమానాస్పదంగా కౌగలించుకుని, పైకి ఎత్తాడు. అది నాకు ఎంతో భయంకరమైన అనుభవం. ఆ సమయంలో అమ్మ కూడా ఉంది. కానీ నన్ను ఒక్కదాన్నే ఆఫీసులోకి రమ్మని చెప్పి అలా ప్రవర్తించాడు. అంతకముందు ఆ వ్యక్తి అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. అతని వికృతి ప్రవర్తన, నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత కూడా నాకు చాలాసార్లు ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. పబ్లిక్ ఈవెంట్లు, కచేరిలకు అంతరాయం కలిగించడానికి ఆన్‌లైన్‌గా కూడా వేధింపులకు దిగడంతో, నేను తొలిసారి ఫిర్యాదు దాఖలు చేసి, అరెస్ట్ కూడా చేయించాను’ అని చిన్మయి చెప్పారు.
ఇట్స్‌ప్రశాంత్ బండారం బట్టబయలు....
యూట్యూబ్‌లో మూవీలకు రివ్యూలు చేపట్టే ప్రశాంత్ అనే వ్యక్తి బండారాన్ని కూడా చిన్మయి ట్విటర్ వేదికగా బయటపెట్టారు. ఇటీవల ఇట్స్‌ప్రశాంత్ అనే అకౌంట్‌తో, అతను అసభ్యకరంగా మెసేజ్‌లు చేశాడని చెబుతూ.. అతని మెసేజ్‌లను ట్విటర్‌లో షేర్‌చేశారు. ఇట్స్‌ప్రశాంత్ అనే వ్యక్తి కేవలం చిన్మయినే కాక, మిగతా అమ్మాయిలతో కూడా ఇదే రకంగా ఫేస్‌బుక్, ట్విటర్ మాధ్యమాల ద్వారా అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ.. వేధిస్తున్నాడని తెలిసింది. ఇట్స్‌ప్రశాంత్ నుంచి ఎదుర్కొన్న పలు అనుభవాలను పలువురు అమ్మాయిలు చిన్మయి ట్విటర్‌కి షేర్ చేస్తున్నారు.
మరోవైపు హఫ్‌పోస్ట్ ఇండియా మాజీ ట్రెండ్స్ ఎడిటర్ అనురాగ్ వర్మ, బిజినెస్ స్టాండర్డ్ జర్నలిస్ట్ మయాంక్ జైన్, డీఎన్‌ఏ ముంబై మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ గౌత్ అధికరి, నవలా రచయిత కిరణ్ నగర్కర్, సాంస్కృతిక విమర్శకుడు సదానంద్ మీనన్, కమెడియన్ ఉత్సవ్ చక్రవర్తి వంటి పలువురు ప్రముఖులు కూడా తోటి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మీటూ ఉద్యమం ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా జర్నలిస్టులు ఒక్కొక్కరూ చేస్తున్న ట్వీట్లు, వారు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలు.. సమాజంలో అత్యంత కీలకమైన వృత్తి జర్నలిజం పట్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ప్రతి గంట గంటకు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళా జర్నలిస్ట్‌ల సంఖ్య పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment