ఆ వీడియో వివాదం ముగిసింది!
న్యూయార్క్ : ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఎంతో మంది వీరాభిమానులను సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ నటించిన 'థ్రిల్లర్' వీడియోను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గతంలో థ్రిల్లర్ వీడియోకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం ముగిసిపోవడంతో తిరిగి తెరపై తీసుకురావడానికి సన్నాహాలు ఆరంభించారు. అయితే ఈ వీడియోను త్రీడీ రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర దర్శకుడు జాన్ లాండిస్ తెలిపాడు.
' నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ 14 నిమిషాల అల్బమ్ కు జాక్సన్ న్యాయం చేశాడు. ఈ ఆల్బమ్ లో సాంగ్స్ సూపర్ హిట్ కావడమే మరోసారి త్రీడిలో తీసుకురావడానికి కారణం. దీనిపై గతంలో చోటు చేసుకున్న దావా వివాదం సమసి పోయింది. ఆ వీడియోపై న్యాయ పరమైన సమస్యలు తలెత్తడంతో ఆ వివాదం చాలా సంవత్సరాల పాటు నడిచింది. ప్రస్తుతం ఆ వివాదాన్ని సెటిల్ చేసుకున్నాం. 2015 లో ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది' అని లాండిస్ తెలిపాడు. ఈ వీడియోను జాక్సన్ అభిమానులు తిరిగి అత్యంత అధునాతనంగా బిగ్ స్ర్కీన్లపై తిలకించే అవకాశం దక్కుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు.