నటుడు శింబుపై చర్యలేవి అంటూ నిర్మాత పీఎల్.తేనప్పన్ ప్రశ్నించడంతో ఒక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైకెల్ రాయప్పన్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో తాను రూ. 20 కోట్లకు పైగా నష్ట పోయానని, అందుకు కారణం నటుడు శింబునే అని చెప్పారు. తాను సరిగా షూటింగ్‌కు రాకపోవడంతోనే షూటింగ్ ఆగిందని నిర్మాత మైకెల్ రాయప్పన్ నిర్మాతల మండలిలో శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నష్టపోయిన రూ. 20 కోట్లను శింబు చెల్లించాలని అందులో పేర్కొన్నారు.
అదే నిర్మాత తాజాగా జీవా, నిక్కీగల్రాని జంటగా ‘కీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పాల్గొన్నారు. మరో అతిథిగా పాల్గొన్న నిర్మాత పీఎల్. తేనప్పన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత మైకెల్ రాయప్పన్ నటుడు శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినా, ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను ప్రశ్నించారు. దీంతో విశాల్‌కు అనుకూలంగా విన్నర్ చిత్ర నిర్మాత రామచంద్రన్ ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం అని అనడంతో వాగ్వాదం రచ్చగా మారింది.
అనంతరం విశాల్ మాట్లాడుతూ మైకెల్‌రాయప్పన్ ఫిర్యాదుపై నటుడు శింబును వివరణ కోరామని, అయితే ఆయన స్పందించలేదని తెలిపారు. ఈ సమస్యపై త్వరలోనే చర్చిస్తామని చెప్పారు. నిర్మాతలకు మంచే జరుగుతుందని విశాల్ అన్నారు. తాను మైకెల్ రాయప్పన్ నిర్మించిన కీ చిత్రం కోసం ఫిబ్రవరి 9వ విడుదల చేయాల్సిన తన చిత్రం ఇరుంబుతిరై చిత్రాన్ని మరోసారి వాయిదా వేసుకుంటున్నానని తెలిపారు. అదే విధంగా ఆయన సంస్థలో తాను పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధం అని, ఆ చిత్ర విజయం సాధిస్తే అప్పుడు పారితోషికం తీసుకుంటానని విశాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment