నాది చాలా సిల్లీ యాక్సిడెంట్: కమల్
కాలు ఫ్రాక్చర్ అయ్యి.. దానికి రెండుసార్లు శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత కమల్‌హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఇంకా పూర్తిస్థాయిలో దాన్నుంచి కోలుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. తన ఆఫీసులో సినిమాకు సంబంధించిన పని చూసుకుని వస్తూ.. 18 అడుగుల ఎత్తు నుంచి పడ్డానని కమల్ చెప్పారు. తాను చాలా సంవత్సరాలుగా అదే ఆఫీసు వాడుతున్నానని, అలవాటైనదే అయినా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
అసలు చెప్పాలంటే ఇది చాలా సిల్లీ యాక్సిడెంట్ అని, గతంలో దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ అమితాబ్ బచ్చన్ చెయ్యి కాల్చుకున్నట్లుగానే తనకూ అయ్యిందని నవ్వుతూ చెప్పారు. కూలీ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి, దాన్నుంచి కోలుకున్న తర్వాత.. 1983 సంవత్సరంలో దీపావళి టపాసులు కాలుస్తూ చెయ్యి కాల్చుకోవడంతో చాలా నెలల పాటు అమితాబ్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే విషయాన్ని కమల్ గుర్తుచేశారు.
నిజానికి తాను కూడా పైనుంచి కింద పడినప్పుడు తీవ్రంగా రక్తస్రావం అయిందని, దానివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని, కానీ అదృష్టవశాత్తు ఆ సమయానికి ఆఫీసులో వేరేవాళ్లు కూడా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల బతికిపోయానని అన్నారు. ప్రస్తుతం కమల్ తన దశావతారం సినిమాకు సీక్వెల్‌గా శభాష్ నాయుడు అనే సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగులో ఆయన మళ్లీ పాల్గొనే అవకాశం ఉంది.