Mismatch Movie Review, in Telugu | Rating (2.5/5) | ‘మిస్‌ మ్యాచ్‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘మిస్‌ మ్యాచ్‌’ మూవీ రివ్యూ

Published Fri, Dec 6 2019 1:34 PM | Last Updated on Sat, Dec 21 2019 2:16 PM

Mismatch Telugu Movie Review And Rating - Sakshi

మూవీ: మిస్‌ మ్యాచ్‌
జానర్‌:  లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా
నటీనటులు: ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్‌, ప్రదీప్ రావత్, సంజయ్ స్వరూప్, రేణుక, రూపాలక్ష్మి, భద్రం తదితరులు
సంగీతం: గిఫ్టన్‌ ఇలియాస్
కథ: భూపతి రాజా
దర్శకత్వం:  నిర్మల్‌ కుమార్‌
నిర్మాతలు: జి. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌

‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్న యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌. మరోవైపు ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమన్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ‘సలీం’ ఫేమ్‌ ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఎన్నో అంచనాల మధ్య నేడు ‘మిస్‌ మ్యాచ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్‌ అయిందా? టాలీవుడ్‌లో ఐశ్వర్య మరోసారి సత్తాచాటిందా? హీరోగా ఉదయ్‌ శంకర్‌ ద్వితీయ విఘ్నం దాటాడా? అనేది చూద్దాం.

మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ చెప్పినట్టే భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథకు అందమైన దృశ్యరూపమే ‘మిస్‌ మ్యాచ్‌’. ఏ కథలో చూసినా  కులం, మతం, డబ్బు, పరువు వంటివి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. కానీ ఈ కథలో ప్రేమకు, పెళ్లికి ఆట అడ్డుగా నిలిచింది. కుస్తీ ఆటనే ప్రాణంగా భావించే హీరోయిన్‌ కుటుంబం.. క్లాస్‌ అండ్‌ డీసెంట్‌గా ఉండే హీరో ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల సంఘర్షణ మధ్య హీరోహీరోయిన్లు వారి ప్రేమను దక్కించుకున్నారా? దంగల్‌ బ్యాచ్‌కు పొంగల్‌ బ్యాచ్‌కు మ్యాచ్‌ ఓకే అయిందా? లేక మిస్‌ మ్యాచ్‌ అయిందా? అనేదే  సినిమా కథ.

కథ: 
గోవింద్‌ రాజు(ప్రదీప్‌ రావత్‌)కు రెజ్లింగ్‌(కుస్తీ)అంటే ఇష్టం.. కాదు ప్రాణం. దేశానికి ఆడే అవకాశం తనకు రాకపోవడంతో తన కూతురు మహాలక్ష్మి(ఐశ్వర్యా రాజేశ్‌) ద్వారా తన కలను నెరవే​ర్చుకోవాలని నిరంతరం తపిస్తుంటాడు. మరోవైపు చిన్నప్పుట్నుంచి చదువు తప్ప మరో ధ్యాస లేకుండా పెరిగిన సిద్దార్థ్‌(ఉదయ్‌ శంకర్‌) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యూయేట్‌ పట్టా అందుకొని సొంతంగా ఎమ్ఎన్‌సీ కంపెనీ స్థాపిస్తాడు. అయితే అనుకోకుండా ఓ పోగ్రామ్‌లో భాగంగా హీరోహీరోయిన్లు కలుసుకుంటారు. 

వీరిద్దరి కలయిక కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపి పెళ్లికి అంగీకరించేలా ఒప్పిస్తారు. అయితే సిద్దార్థ్‌ తండ్రి పెళ్లి జరగాలంటే మహాలక్ష్మి కుటుంబానికి ఓ కండీషన్‌ పెడతాడు. దీనికి మహాలక్ష్మి కుటుంబం రియాక్షన్‌ ఏంటి?  ఆ షరతుకు మహాలక్ష్మి ఫ్యామిలీ ఒప్పుకుందా? ఇంతకీ ఆ కండీషన్‌ ఏంటి? ఆ తర్వాత జరిగిందేంటి? సిద్దార్థ్‌ మహాలక్ష్మిల ప్రేమ గెలిచిందా? రెండు కుటుంబాలు చివరికి వీరి పెళ్లికి అంగీకరించాయా? అనేదే మిస్‌ మ్యాచ్‌ కథ.

నటీనటులు:
‘ఆటగదరా శివ’ తో నటుడిగా వందకు వంద మార్కులు సాధించిన ఉదయ్‌ శంకర్‌ ఈ సినిమాలో సిద్ధార్థ్‌గా జీవించాడు. నటనకు అత్యంత స్కోప్‌ ఉన్న ఈ సినిమాలో హీరోగా, తన హీరోయిజంతో ఉదయ్‌ శంకర్‌ మెప్పిస్తాడు. డ్యాన్స్‌, ఫైట్‌, ఎమోషన్‌తో నటుడిగా ఉదయ్‌ శంకర్‌ ఓ మెట్టు పైకెక్కాడు. ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మాదిరిగానే ఈ సినిమాల కూడా మన పక్కింటి అమ్మాయిగా కౌసల్య కృష్ణమూర్తి కనిపిస్తుంది. క్రీడాకారిణిగా, తండ్రి ఆశయం కోసం కష్టపడే కూతురిగా, స్నేహితులతో కలిసి అల్లరి పిల్లగా, ప్రేమికురాలిగా, తన ప్రేమను దక్కించుకోవాడానికి తాపత్రయ పడే సగటు అమ్మాయిగా ఐశ్వర్యా, మహాలక్ష్మి పాత్రలో జీవించేసింది.    

చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ స్క్రీన్‌పై కనిపించాడు ప్రదీప్‌ రావత్‌. అయితే ఈ సినిమాలో విలన్‌ పాత్రలో కాకుండా హీరోయిన్‌ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక యధావిధిగా సంజయ్ స్వరూప్ హీరో తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక భద్రం, రేణుకతో పాటు హీరో ఫ్రెండ్స్‌గా నటించిన ఇద్దరు నటులు​ ఫస్టాఫ్‌లో తమ కామెడీతో అలరిస్తారు. మిగతా తారాగణం తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 


విశ్లేషణ:
విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కిన ‘సలీమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన నిర్మల్‌ కుమార్‌ ‘మిస్‌ మ్యాచ్‌’తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఓ సున్నితమైన ప్రేమ కథా అంశాన్ని తీసుకొని అన్ని కమర్షియల్‌ అంశాలను జోడించి ప్రేక్షకులకు అందించడంలో డైరెక్టర్‌ తొలి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. హీరోహీరోయిన్‌లతో పాటు వారి కుటుంబాల బ్యాగ్రౌండ్‌, సిద్ధార్థ్‌ మహాలక్ష్మిల ప్రేమ, ఆ తర్వాత గొడవలతో ఫస్టాఫ్‌ మొత్తం చకాచకా సాగిపోతుంది. అంతేకాకుండా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇక మొదటి భాగంలో నెక్ట్స్ ఏంటి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా దర్శకుడు చాలా చక్కగా స్క్రీన్‌ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి దర్శకుడు కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా ప్రేమ, ఎమోషన్స్‌ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో సగటు ప్రేక్షకుడు క్లైమాక్స్‌ వరకు ఏం జరగబోతోందనే ఆసక్తిని కనబరుస్తాడు.  

ఇక సెకండాఫ్‌లో వచ్చే తొలిప్రేమలోని ‘ఈ మనసే..’ సాంగ్‌ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లేలా ఉంది. అయితే ఈ పాటను ఏమాత్రం చెడగొట్టకుండా సంగీత దర్శకుడు గిఫ్టన్‌ ఇలియాస్ అద్భుతంగా రీమిక్స్‌ చేశాడు. ఇక మిగతా పాటలు కూడా సినిమాకు కరెక్ట్‌ యాప్ట్‌ అయ్యేలా ఉన్నాయి. సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్బ్‌గా పాటలు రాశారు రచయితలు.   

మాటల రచయిత తమ ఫవర్‌ ఫుల్‌ డైలాగ్‌లతో పాటు, హార్ట్‌టచింగ్‌ మాటలను అందించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ‘రంగస్థలంలో చూసేవాడు, ఆడేవాడు, గెలిచేవాడు అనే ముగ్గురు మాత్రమే ఉంటారు. చివరికి గెలిచేవాడిదే సమస్తం’అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక స్టంట్‌ మాస్టర్‌ శక్తి శరవణన్‌ హీరోతో చాలా స్టైలీష్‌గా ఫైట్‌ చేయించాడు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెడితే బాగుండేది. ఇక సినిమాకు తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. 


ప్లస్‌ పాయింట్స్‌
ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నటన
ఫస్టాఫ్‌
‘ఈ మనసే’ రీమిక్స్‌ సాంగ్‌

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌
కొన్ని సాగదీత సీన్లు

- సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement