నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇందులో కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు మాత్రమే యాప్ట్ అని ఆయన్ను అప్రోచ్ అయ్యారు చిత్రయూనిట్. కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారు. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో మోహన్ బాబు పాల్గొననున్నారు.
ఈ సినిమాలో మోహన్‌బాబుని నటింపజేయాలనుకున్నప్పుడు ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్నను సంప్రదించారు సూర్య, సుధ. ఆరునెలల క్రితం మోహన్‌బాబు ఈ సినిమా అంగీకరించారు. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే.
‘ఇరుది సుట్రు’ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డైరెక్టర్స్‌లో డిఫరెంట్ డైరెక్టర్ అనిపించుకున్న సుధ కొంగర తాజాగా సూర్య, మోహన్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment