
7 రోజులు... 68 గంటలు!
తెలుగు నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జస్ట్ వారం రోజులు చాలు. రోజుకి సుమారు ఓ పది గంటల పాటు కష్టపడితే.. సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పొచ్చు అంటున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘మనమంతా’. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు ప్రధాన పాత్రధారులు. మోహన్‌లాల్ తెలుగులో నటించిన పూర్తి స్థాయి చిత్రమిది. అంతే కాదు.. ఆయన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. డబ్బింగ్ చెప్పడానికి ముందు 7 రోజుల్లో 68 గంటల పాటు కష్టపడి తెలుగు నేర్చుకుని, భాషపై పట్టు సాధించానని మోహన్‌లాల్ తెలిపారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా హ్యాపీగా ఉందన్నారాయన.
ఆగస్టు 5న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘సిని మా చూసే ప్రతి ఒక్కరికీ తమ గతం గుర్తుకు వస్తుంది. డబ్బింగ్ చెప్తుంటే నన్ను నేను తెరపై చూసుకుంటున్నట్లు అనిపించింది. చంద్రశేఖర్ ఏలేటి సినిమాని అద్బుతంగా తీర్చిదిద్దాడు. నా పాత్రతో పాటు గౌతమి, విశ్వాంత్, రైనారావు పాత్రలు చక్కగా వచ్చాయి. అన్ని వర్గాలను అలరిస్తుందీ సినిమా’’ అన్నారు.