మోహన్‌లాల్‌కు జంటగా గౌతమి
ఒకప్పటి ప్రముఖ బహుభాషా కథానాయకి గౌతమి. కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కమలహాసన్‌కు జంటగా పాపనాశం చిత్రంతో రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించడంతో మళ్లీ గౌతమికి అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే తనకు తగిన పాత్ర అయితేనే నటించాలని నిర్ణయించుకున్న తను తాజాగా ఒక త్రిభాషా చిత్రంలో నటించడం విశేషం. అదీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తుండడం మరో విశేషం.
గౌతమి ఇంతకు ముందు మలయాళంలో మోహన్‌లాల్ సరసన హీజ్ ఐనస్ అబ్దుల్లా అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో మోహన్‌లాల్ గౌతమిలది హిట్ జంటగా పేరొందింది. తాజాగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఒక చిత్రంలో మోహన్‌లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. దీనికి తెలుగులో మనమంతా అనే పేరును, మలయాళంలో నమదు అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఇందులో విశ్వనాథ్, హనీషా అమ్రేష్ యువ జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఊర్వశి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు నటిస్తున్నారు. ఈ త్రిభాషా చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు గోపీచంద్ తదితర ప్రముఖ కథానాయకులతో చిత్రాలను తెరకెక్కించిన ఏలేటి చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు.