మతం మార్చుకున్న మోనిక
తమిళ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న నటి మోనిక ఇప్పుడు ఇస్లామ్ మతం స్వీకరించారు. అందుకు తగ్గట్లే తన పేరును ఎం.జి.రహీమాగా మార్చుకున్నారు. ఇకపై, సినిమాల్లో నటించనంటూ, నటనకు గుడ్‌బై చెప్పేశారు. ఈ హఠాత్పరిణామానికి కారణం ఏమిటన్నది ఆమె చెప్పలేదు కానీ, మతం మార్చుకున్న విషయాన్ని శుక్రవారం నాడు చెన్నైలో పత్రికా విలేకరులకు తెలియజేశారు. చిన్న వయసులోనే బాలనటిగా మొదలుపెట్టి నాయిక పాత్రల దాకా ఎదిగిన మోనిక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 దాకా చిత్రాల్లో నటించారు.
‘‘బాల నటిగా మొదలైన నేను ఇన్నేళ్ళుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు’’ అని ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ‘‘డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో నేను మతం మార్చుకోలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారాను’’ అని మోనిక వివరించారు. పెళ్ళి గురించి వివరాలను త్వరలోనే చెబుతానని ఆమె అన్నారు. వెంకటేశ్ సూపర్ హిట్ ‘చంటి’ (1991)లో, తమిళ ‘సతీ లీలావతి’ (’95)లో బాల నటిగా చేసిన మోనిక పెద్దయ్యాక తెలుగులో ‘శివరామరాజు’, ‘మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక మోనికగా పేరు మార్చుకున్న రేఖా మారుతీరాజ్ ఇప్పుడిలా ఇస్లామ్ మతం పుచ్చుకోవడంతో మరోసారి పేరు మారినట్లయింది.