తమిళసినిమా: ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్‌లోనే మోస్ట్ మెమొరబుల్‌గా భావిస్తున్నానని స్పైడర్ చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేర్కొన్నారు. టాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ.ప్రసాద్ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీష్‌జయరాజ్ సంగీతం అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన ఇందులో ఎస్‌జే.సూర్య, భరత్ ప్రతినాయకులుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు సంతరించు కున్న స్పైడర్ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
మహేశ్‌బాబు సహకారంతోనే..
చిత్ర దర్శకుడు ఏఆర్.మురగదాస్ మాట్లాడుతూ తమిళం, తెలుగు అంటూ ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది ఈ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా చిత్రం ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని అన్నారు.
10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది:
మహేశ్‌బాబు మాట్లాడుతూ స్పైడర్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోందని, అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కలిసి స్పైడర్ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పా రు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్ చిత్రం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. స్పైడర్ చిత్రం మహేశ్‌బాబు కెరీర్‌లోనే దిబెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్‌వీ.ప్రసాద్ పేర్కొన్నారు.