సినిమా రివ్యూ: చందమామ కథలు
ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్), రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని తదితర నటులతో మొత్తం ఎనిమిది కథలతో రూపొందిన ఈ చిత్రానికి విడుదలకు ముందు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇంతకీ సినిమాలోని కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం...
సారధి (కిషోర్) ఓ రచయిత. అతనికి కావేరి అనే కూతురు ఉంటుంది. కావేరికి లుకేమియా సోకడంతో సారథికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆస్తిపాస్తులు అంతగా లేని సారథి కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఎలా సంపాదించుకున్నారు? లుకేమియా నుంచి కావేరి బయటపడిందా? సారథి, కావేరి కథకు మరో ఏడు కథలకు సంబంధమేమిటనే ప్రశ్నలకు సమాదానమే 'చందమామ కథలు' చిత్రం.
నటీనటుల ప్రదర్శన
లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషిలవి కథపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్గా ఓ మోడల్గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు.
సాంకేతిక వర్గం: ఎనిమిది కథల సంకలనం 'చందమామ కథలు' ఓ ఫీల్ గుడ్ చిత్రమనిపించడానికి ప్రధాన కారణం మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి తోడు సురేశ్ పోటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. ధర్మేంద్ర కత్తెరకు మరింత పదును పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్లో పాత్రల పరిచయం కొంత డాక్యుమెంటరీ స్టైల్లో అనిపించడానికి పూర్ ఎడిటింగ్ కారణమని అనిపిస్తుంది. ఎనిమిది కథలకు తగినట్టుగా, సరిగ్గా అతికినట్టుగా నటీనటులను దర్శకుడు ఎంపిక చేసుకోవడంలో విజయం సాధించారు. ఇక ఎనిమిది కథలను సీన్ బై సీన్ ను పేర్చుకుంటూ రూపొందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మల్టిప్లెక్స్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని కథల సంకలనంగా రూపొందిన 'చందమామ కథలు' టాలీవుడ్లో ఓ కొత్త ప్రయోగమే.