ఘోర నేరాలపై శౌర్యం
కొన్ని కథలు కొత్తగా ఉంటాయి. మరికొన్ని కొత్తగా చెప్పాల్సి ఉంటాయి. చాలా కొద్దికథలే కొత్తగానూ, కొత్తగా చెప్పినట్లుగానూ ఉంటాయి. మొదటి రెండు రకాల సినిమాలూ తరచూ వస్తాయి. మూడో రకం సినిమాలు రావ డమే అరుదు. అలాంటి సినిమాలు తీసేవారూ అరుదే. అలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు రాత, దానితో పాటు తీత - రెండూ కత్తి మీద సామే. కానీ, ధైర్యం చేసి, దర్శక - నిర్మాతలు తెరపై చూపిన ‘శౌర్య’ం - ఈ ఫిల్మ్.
చిన్న పాయింట్‌తో అల్లుకున్న 2 గంటల కథేమిటంటే, శౌర్య (మనోజ్) కోట్ల ప్రాజెక్ట్ సాధించినా, దాన్ని ప్రేమించిన అమ్మాయి నేత్ర (రెజీనా) కోసం వదులుకొనే కుర్రాడు. శివరాత్రి నాటి రాత్రి మొక్కు తీర్చేందుకు గుడిలో జాగారం చేస్తుంటే, హీరో పక్కనే హీరోయిన్ పీక తెగి, రక్తపు మడుగులో ఉంటుంది. ఆ నేరం హీరోపై పడుతుంది. డెత్‌బెడ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఒక నంబర్ రాసి, కన్ను మూస్తుంది. ఎంపీ కూతురైన హీరోయిన్‌కీ, హీరోకీ సంబంధమేంటి? ఆ నంబరేంటి? హీరోయే నిజంగా నేరం చేశాడా లాంటి వన్నీ సస్పెన్‌స నిండిన ఈ థ్రిల్లర్ లవ్‌స్టోరీలో తెరపై చూడాల్సినవి.
గత ఏడాదే వివాహమైన మనోజ్ ఈ సినిమాలో పాత్ర కోసం బొద్దుగా, ముద్దుగా అయ్యారు. ఎమ్‌ఫార్మసీ చదివిన, హుందాతనం నిండిన ఉద్యోగిగా కాస్ట్యూమ్స్‌లో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. ఇక, హీరో ప్రేమికురాలిగా, పలుకుబడి ఉన్న ఎంపీ కూతురు నేత్రగా రెజీనాది అభినయపరంగా కాకున్నా, కథా పరంగా కీలక పాత్ర. ఎస్.ఐగా ప్రకాశ్‌రాజ్‌ది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్. హీరోయిన్ తండ్రిగా నాగినీడు, బాబాయ్‌గా సుబ్బరాజులది పాత్రోచిత నటన. కామిక్ రిలీఫ్ కోసం సినిమాలో హీరోయిన్ బావగా ‘ప్రభాస్’ శ్రీను, పోలీసు కానిస్టేబు ల్‌గా ‘షకలక’ శంకర్ లాంటివాళ్ళున్నారు. ‘చుచ్చూ పోయిస్తా!’ అంటూనే, లేని దయ్యానికి భయపడే మినిస్టర్‌గా బ్రహ్మానందం సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తారు. ఆయనపై పాట అదనం. ఆ కాసేపు పక్కన పెడితే, మిగతా సినిమా అంతా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియల్ ఆఫ్ సీన్స్.
చిత్రం: ‘శౌర్య’,
తారాగణం: మంచు మనోజ్, రెజీనా కసండ్రా, ప్రకాశ్‌రాజ్, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం, ‘ప్రభాస్’ శ్రీను,
రచన: గోపీ మోహన్,
మాటలు: దశరథ్, కిశోర్ గోపు,
సంగీతం: కె. వేదా,
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్,
నిర్మాత: మల్కాపురం శివకుమార్,
కథ - దర్శకత్వం: దశరథ్,
నిడివి: 121 నిమిషాలు,
రిలీజ్: మార్చి 4
దర్శకుడు దశరథ్ సోదరుడైన వేదా ఇచ్చిన సంగీతం ఆయనలోని వైవిధ్య ప్రదర్శనకు ఉపకరిస్తుంది. కెమేరామన్, ఎడిటర్, ఫైట్స్ లాంటి సాంకేతిక విభాగాలన్నీ కథ, కథనానికి తగట్టుగానే ఉన్నాయి. మొదట క్యారె క్టర్ల పరిచయం, పీటముడిగా మారిన ఒక ఊహించని క్రైమ్‌లో అనుకోని మలుపుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ సమయంలో కోర్టులో హీరో చెప్పిన ఒక మాటతో ఊహించని ట్విస్ట్. దాంతో, ఇంటర్వెల్. ‘థ్రిల్ కంటిన్యూస్’ అనే ఇంటర్వెల్ కార్డ్‌కు తగ్గట్లే, ఫస్టాఫ్ తర్వాతా కథ సీరియస్‌గా సాగిపోతూ... ఉంటుంది. మరో అరగంటలో సినిమా ముగుస్తుందనగా, కథలో కొత్త వేగం వస్తుంది. ఓపిక పట్టినవాళ్ళకు సస్పెన్స్ వీడే అరగంట తప్పక బాగుంటుంది.
పెచ్చరిల్లుతున్న కుల విద్వేషాలు, పరువు హత్యలనే సమకాలీన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం అభినందించాల్సిందే. అయితే, దాన్ని మనసును కదిలించే సెంటిమెంటల్ అంశాలతో కాకుండా, విభిన్నంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందించాలని భావించారు. ముడివీడనట్లు కనిపిస్తున్న ఒక నేరం తాలూకు మిస్టరీని సాల్వ్ చేయడం కోసం సస్పెన్స్ పంథాను ఆశ్రయించారు. అలా ఈ సినిమా పూర్తిగా ఆ దోవలో వెళ్ళింది.
ఈ వ్యవహారంలో హీరోతో పాటు పోలీస్ ప్రకాశ్‌రాజ్, నేరస్థులూ మరింత కీలకంగా వ్యవహరిస్తే, కథకు ఇంకా ఊపు, ఉత్సాహం వచ్చేవి. మిస్టరీ సాల్వేషన్‌కి ఒకరు, దానికి వ్యతిరేకంగా మరొకరు వ్యవహరించడ మనే పంథాలో కలిసొస్తుంది. మొత్తం మీద, ప్రేమకథలోనే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల లాంటివి కలవడం ఒక కొత్తదనమే. అందుకే, టీవీలో కనిపించే ‘నేరాలు - ఘోరాలు’ లాంటి క్రైమ్‌స్టోరీలకు ఇది వినూత్నమైన వెండితెర ఆవిష్కారం. చాలాసార్లు మనం చూసి ఊహించే దానిలోనో, అవతలివాళ్ళు చెప్పే దానిలోనో కాక, అసలు నిజం వేరొకటి ఉంటుందని అవగాహన కల్పిస్తుంది. వెరసి, ఈ సినిమా ‘ఆనర్ కిల్లింగ్స్’ లాంటి ఘోర మైన నేరాలపై చూపిన ‘శౌర్యం’.
- రెంటాల జయదేవ