థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ఇది!
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లతో కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దశరథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం - ‘శౌర్య’. మంచు మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దశరథ్ చెప్పిన ముచ్చట్లు...
డిఫరెంట్ లవ్‌స్టోరీ చేయాలని ‘శ్రీ’ చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లో, తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్లో ప్రేమకథలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ‘శౌర్య’లో ఎవరూ ఊహించని ప్రత్యేక కోణం ఉంటుంది.
ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ. ఫైట్లుండవు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మనోజ్ రెండు వేర్వేరు పాత్రల్లో నటించాడు. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘శ్రీ’ చిత్రం తర్వాత చాలా కాలానికి మళ్ళీ మనోజ్‌తో చేసిన చిత్రమిది. ఇప్పుడు కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రమూ తగ్గలేదు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు.
నా కెరీర్‌లో జయాలు, అపజయాలు చూశా. ఆ రెండింటినీ సమానంగా చూడడం వల్లే సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. సినిమాలోని విషయం నచ్చితే ఆదరిస్తారు.
తెలుగు సినీ పరిశ్రమలో నాకు కొద్దిమంది స్నేహితులున్నారు. దర్శకుడు వీవీ వినాయక్, హీరోలు మనోజ్, ప్రభాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ మంచి స్నేహితులు. సినిమాలతో సంబంధం లేకుండా మేము రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ప్రభాస్‌తో తప్పకుండా ఓ చిత్రం చేస్తా. ఆ వివరాలు త్వరలో చెబుతా.