సినిమా రివ్యూ: ప్రేమించాలి
సినిమా రివ్యూ: ప్రేమించాలి
Published Thu, Feb 27 2014 2:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
ఈ రోజుల్లో ప్రేమ మత్తులో విద్యార్థులు హద్దు మీరి ప్రవర్తిస్తే ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకుంటాయనే కథ నేపథ్యంగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఆదాలల్ కాదల్ సీవీర్' చిత్రాన్ని'ప్రేమించాలి' పేరుతో రీమేక్ గా ఫిబ్రవరి 27న నిర్మాత సురేశ్ కొండేటి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇంజనీరింగ్ చదువుతున్న కార్తీక్ (సంతోష్), శ్వేత ( మనీషా యాదవ్) ప్రేమించుకుంటారు. ప్రేమ మత్తులో హద్దు మీరడంతో శ్వేత గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన శ్వేత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, తమ కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని తెలుసుకున్న తల్లితండ్రుల మానసిక క్షోభ ఏంటి? కార్తీక్ చేసిన తప్పిదానికి అతడి తల్లితండ్రులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? కార్తీక్, శ్వేత పెళ్లి చేసుకున్నారా? కార్తీక్ ను పెళ్లి చేసుకోకపోతే గర్భం దాల్చిన శ్వేత పరిస్థితి ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానం.
విశ్లేషణ:
కార్తీగా సంతోష్ రమేశ్, శ్వేత పాత్రల్లో మనీషాలు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో మనీషా ఎయోషన్స్ పలికించడంలో పరణితి ప్రదర్శించింది. శ్వేత తండ్రి పాత్రలో జయప్రకాశ్, తల్లి పాత్రలో తులసి, కార్తీక్ తల్లి పాత్రలో పూర్ణిమ జయరామ్, తండ్రి పాత్రలో రామనాథ్ షెట్టీలు పూర్తి న్యాయం చేకూర్చారు. కార్తీక్ స్నేహితుడు పాత్రలో జై ఓకే అనిపించాడు.
ఈ చిత్రంలో టెంపోను కంటిన్యూ చేయడంలో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ బాల సుబ్రమణ్యం పాడిన పాట ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. డబ్బింగ్, ఇతర సాంకేతిక అంశాలను తెలుగు నేటివిటికి కన్వర్ట్ చేయడంలో సురేశ్ కొండేటి పాటించిన నిర్మాణాత్మక విలువు బాగున్నాయి.
ఈ చిత్ర తొలి భాగం రెగ్యులర్ ఫార్మాట్ లోనే అబ్బాయిలు, అమ్మాయిల ప్రేమ వ్యవహారాలు అంశాలు, ఆతర్వాత కార్తీక్, శ్వేత ప్రేమ కథను తెరకెక్కించిన దర్శకుడు సుసీంద్రన్ రెండో భాగంలో తన ప్రతిభాపాటవాలతో విశ్వరూపం చూపించాడు. చిత్రం ద్వితీయార్థంలో శ్వేత గర్బవతి అయిన తర్వాత ఆమె అనుభవించిన కష్టాలు, మానసిక వేదనను చక్కగా చిత్రీకరించడంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. కాలేజికి వెళ్లి చదువుకుంటోందనే భ్రమలో ఉండే తల్లితండ్రులకు కూతురు గర్భవతి అని తెలిస్తే ఎలా ఉంటుందనే బాధను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు.
ఇక చిత్రంలో ప్రధానంగా చెప్పకోవాల్సి వస్తే, శ్వేత ప్రసవించిన తర్వాత పుట్టిన బాబును అనాధ శరణాలయానికి అప్పగించడం, ఆ తర్వాత అనాధ పిల్లాడు ఎలాంటి కష్టాలను అనుభవించాడనే సన్నివేశాలతో దర్శకుడు గుండెలు పిండేశాడు. ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదని..పరిపక్వత లేని ప్రేమ మాటున హద్దు మీరితే ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తుందనే కథాంశంతో 'ప్రేమ అంటే బాధ్యత, ఓ జాగ్రత్త' అనే సందేశాన్ని ప్రేక్షకులకు, సమాజానికి తెలియచేయడంలో దర్శకుడు తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చాడని చెప్పవచ్చు.
తల్లిదండ్రుల కలల్ని, తమ భాద్యతల్ని, లక్ష్యాలను మరిచి ప్రేమ వ్యమోహంలో హద్దు మీరే యువతకు 'ప్రేమించాలి' చిత్రం ఓ చెంపపెట్టు.
-రాజబాబు అనుముల
Advertisement
Advertisement