Preminchali
-
సినిమా రివ్యూ: ప్రేమించాలి
ఈ రోజుల్లో ప్రేమ మత్తులో విద్యార్థులు హద్దు మీరి ప్రవర్తిస్తే ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకుంటాయనే కథ నేపథ్యంగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఆదాలల్ కాదల్ సీవీర్' చిత్రాన్ని'ప్రేమించాలి' పేరుతో రీమేక్ గా ఫిబ్రవరి 27న నిర్మాత సురేశ్ కొండేటి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇంజనీరింగ్ చదువుతున్న కార్తీక్ (సంతోష్), శ్వేత ( మనీషా యాదవ్) ప్రేమించుకుంటారు. ప్రేమ మత్తులో హద్దు మీరడంతో శ్వేత గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన శ్వేత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, తమ కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని తెలుసుకున్న తల్లితండ్రుల మానసిక క్షోభ ఏంటి? కార్తీక్ చేసిన తప్పిదానికి అతడి తల్లితండ్రులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? కార్తీక్, శ్వేత పెళ్లి చేసుకున్నారా? కార్తీక్ ను పెళ్లి చేసుకోకపోతే గర్భం దాల్చిన శ్వేత పరిస్థితి ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానం. విశ్లేషణ: కార్తీగా సంతోష్ రమేశ్, శ్వేత పాత్రల్లో మనీషాలు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో మనీషా ఎయోషన్స్ పలికించడంలో పరణితి ప్రదర్శించింది. శ్వేత తండ్రి పాత్రలో జయప్రకాశ్, తల్లి పాత్రలో తులసి, కార్తీక్ తల్లి పాత్రలో పూర్ణిమ జయరామ్, తండ్రి పాత్రలో రామనాథ్ షెట్టీలు పూర్తి న్యాయం చేకూర్చారు. కార్తీక్ స్నేహితుడు పాత్రలో జై ఓకే అనిపించాడు. ఈ చిత్రంలో టెంపోను కంటిన్యూ చేయడంలో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ బాల సుబ్రమణ్యం పాడిన పాట ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. డబ్బింగ్, ఇతర సాంకేతిక అంశాలను తెలుగు నేటివిటికి కన్వర్ట్ చేయడంలో సురేశ్ కొండేటి పాటించిన నిర్మాణాత్మక విలువు బాగున్నాయి. ఈ చిత్ర తొలి భాగం రెగ్యులర్ ఫార్మాట్ లోనే అబ్బాయిలు, అమ్మాయిల ప్రేమ వ్యవహారాలు అంశాలు, ఆతర్వాత కార్తీక్, శ్వేత ప్రేమ కథను తెరకెక్కించిన దర్శకుడు సుసీంద్రన్ రెండో భాగంలో తన ప్రతిభాపాటవాలతో విశ్వరూపం చూపించాడు. చిత్రం ద్వితీయార్థంలో శ్వేత గర్బవతి అయిన తర్వాత ఆమె అనుభవించిన కష్టాలు, మానసిక వేదనను చక్కగా చిత్రీకరించడంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. కాలేజికి వెళ్లి చదువుకుంటోందనే భ్రమలో ఉండే తల్లితండ్రులకు కూతురు గర్భవతి అని తెలిస్తే ఎలా ఉంటుందనే బాధను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇక చిత్రంలో ప్రధానంగా చెప్పకోవాల్సి వస్తే, శ్వేత ప్రసవించిన తర్వాత పుట్టిన బాబును అనాధ శరణాలయానికి అప్పగించడం, ఆ తర్వాత అనాధ పిల్లాడు ఎలాంటి కష్టాలను అనుభవించాడనే సన్నివేశాలతో దర్శకుడు గుండెలు పిండేశాడు. ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదని..పరిపక్వత లేని ప్రేమ మాటున హద్దు మీరితే ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తుందనే కథాంశంతో 'ప్రేమ అంటే బాధ్యత, ఓ జాగ్రత్త' అనే సందేశాన్ని ప్రేక్షకులకు, సమాజానికి తెలియచేయడంలో దర్శకుడు తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చాడని చెప్పవచ్చు. తల్లిదండ్రుల కలల్ని, తమ భాద్యతల్ని, లక్ష్యాలను మరిచి ప్రేమ వ్యమోహంలో హద్దు మీరే యువతకు 'ప్రేమించాలి' చిత్రం ఓ చెంపపెట్టు. -రాజబాబు అనుముల -
యువతకు సందేశం
‘ప్రేమిస్తే’ లాంటి ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి, ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఆయన అందిస్తున్న పదవచిత్రం ‘ప్రేమించాలి’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు వీధులపాలవుతున్న సంఘటనలను వింటున్నాం.. చూస్తున్నాం. అసలు పిల్లలు అలా వీధులపాలవడానికి కారణం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథకు సెన్సార్ బోర్డ్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అనీ ప్రేక్షకుల కంట తడిపెట్టించే సినిమా అని భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని సురేష్‌తో కలిసి ‘పిజ్జా’ చిత్రాన్ని విడుదల చేసిన సమన్యరెడ్డి అన్నారు. -
మనసులను తాకే ప్రేమించాలి
స్ట్రయిట్ చిత్రాలను తలపించే అనువాద చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నేటివిటీతో సంబంధం లేని చిత్రాలైతే, ‘డబ్బింగ్’ అని ఇట్టే తెలిసిపోతుంది. సురేష్ కొండేటి అందించినవన్నీ అనువాద చిత్రాలే అయినా, స్ట్రయిట్ చిత్రాలేమో అనే ఫీల్‌ని కలగజేస్తాయి. దానికి కారణం ఆయన ఏ సినిమా విడుదల చేసినా, అది తెలుగు నేటివిటికీ దగ్గరగా ఉండటమే. ప్రేమిస్తే... షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న, పిజ్జా.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సురేష్ తాజాగా తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులో ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న పదో చిత్రం ఇది. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథాచిత్రాలకు భిన్నంగా ఉంటుంది. యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. మనసుల్ని తాకే భావోద్వేగాలతో పాటు, చక్కని సందేశం కూడా ఉంటుంది. ఇప్పటివరకూ మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నింటికీ దాదాపుగా క్లీన్ యు సర్టిఫికెట్టే రావడం గమనార్హం. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు మా నుంచి వస్తాయనడానికి ఇదే నిదర్శనం. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పక ఆకట్టుకుంటుంది’’ అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జయప్రకాష్, పూర్ణిమా జయరామ్, తులసి, కామ్నాథ్శెట్టి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య ఎ.ఆర్, ఎడిటింగ్: ఆంటోని, సహ నిర్మాత: సమన్యరెడ్డి. -
ప్రేమించాలి మూవి స్టిల్స్
-
‘ప్రేమిస్తే’ అంత గొప్పగా...
‘సుశీంద్రన్ సినిమాను తెలుగులోకి అనువదించాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది’’ అని నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సేవియర్’ను సురేష్ కొండేటి ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి అనువ దించారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో మంత్రి గంటా శ్రీనివా సరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని అంజలి, సందీప్కిషన్లకు అందించారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘నా కెరీర్లో ‘ప్రేమిస్తే’ మరచిపోలేని సినిమా. ఆ సినిమాలాగే ‘ప్రేమించాలి’ కూడా గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని కై్లమాక్స్ పాటను సిరివెన్నెలగారితో రాయించాలనుకున్నాను. కానీ భాస్కరభట్లతో రాయించాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే గొప్పగా రాశాడు తను’’ అని చెప్పారు. తమిళంలో విజయం సాధించిన తన చిత్రం ఎస్.కె.పిక్చర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుండటం ఆనందంగా ఉందని సుశీంద్రన్ చెప్పారు. ‘ప్రేమించాలి’ లాంటి మంచి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని భాస్కరభట్ల అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతోపాటు ఎమ్మెల్ కుమార్ చౌదరి, ఏడిద రాజా, విజయ్‌కుమార్ కొండా, నవీన్‌చంద్ర, శ్రీవిష్ణు, శ్రీరామచంద్ర, బాలాదిత్య, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కొత్త అల ఈ ప్రేమరా...
‘‘ఇప్పటివరకు మేం అందించిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. ఈ సినిమా కూడా కచ్చితంగా ఆ జాబితాలో చేరుతుంది’’ అని చెప్పారు నిర్మాత సురేష్ కొండేటి. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలు తీసిన సురేష్, పదో సినిమాగా ‘ప్రేమించాలి’ని అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించిన ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా పాటలు స్వరపరిచారు. ‘కొత్త అల ఈ ప్రేమరా.. కొంటె కల ఈ ప్రేమరా..’ అనే టైటిల్ సాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో రికార్డ్ చేశారు. సురేష్ మాట్లాడుతూ -‘‘నా గత చిత్రం ‘మహేష్’కి ‘మది మోసే మౌనాన్ని...’లాంటి పాట రాసిన పులగం చిన్నారాయణ ఈ ప్రేమ పాటను కూడా బాగా రాశారు. ‘మెలికల్ తిరుగుతుంటే అమ్మాయి..’, ‘కిర్రాకు కిర్రాకు’ పాటల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నరేంద్ర అద్భుతంగా పాడారు. యూత్ పదే పదే పాడుకునే విధంగా ఈ పాట ఉంటుంది. ఇంకా ఇతర పాటలు కూడా సినిమాకి ఎస్సెట్ అవుతాయి. అతి త్వరలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.